JEE Main Preparation Tips | జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి!
జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమవుతోన్న విద్యార్థుల కోసం నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్ ఇవిగో..
Published :25 Sep 2024 05:56 IST
https://results.eenadu.net/news.aspx?newsid=25092024
JEE Main 2024| జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా కొద్ది నెలల్లో జరగనున్న ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం (JEE Main preparation) కావాలో అర్థం కావట్లేదా? చక్కటి ప్రణాళిక, కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దే చదివి రాణించవచ్చంటున్నారు నిపుణులు. మరికొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్ (JEE Main 2025) పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు కొన్ని టిప్స్..
స్టడీ ప్లానింగ్.. (Study Planing)
జేఈఈ మెయిన్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అందువల్ల ఉన్న కొద్ది నెలల సమయాన్నే చక్కగా ప్లాన్ చేసుకోవడం ఎంతో కీలకం. అన్ని సబ్జెక్టులను సమానంగా కవర్ చేసేందుకు వీలుగా మీ సిలబస్‌ను విభజించుకోండి. టైమ్‌టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించాలి. మూడ్ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్లొద్దు. రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకొని అందుకనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ఫలితం సాధించొచ్చు.
ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. (Practice)
ప్రిపరేషన్‌లో జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్‌లు, పాత ప్రశ్నపత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. మాక్ టెస్టుల ద్వారా పరీక్ష సమయంలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మీ పెర్ఫామెన్స్‌ను అంచనా వేయడమే కాకుండా.. ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గుర్తించొచ్చు. అలాగే, పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. వారంలో కనీసం ఒక్క ప్రశ్నపత్రం అయినా సాల్వ్ చేయడం టార్గెట్‌గా పెట్టుకోండి.
విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ గోల్డెన్ ఛాన్స్.. ₹500కే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు!
టైం మేనేజ్‌మెంట్ (Time Management)
పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి టైం మేనేజ్‌మెంట్, రివిజన్ ఎంతో కీలకం. ఉన్న పరిమితమైన సమయంలోనే అటు థియరీ పార్ట్ చదవడం కొనసాగిస్తూనే.. ఇటు ప్రాబ్లమ్ సాల్వింగ్‌ను ప్రాక్టీస్ చేసే అలవాటును పెంచుకోవాలి. దీంతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం మరిచిపోవద్దు. మీ స్టడీ సెషన్‌లో చివరి 30 నిమిషాల సమయాన్ని ముఖ్యమైన కాన్సెప్టుల రివిజన్‌కు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఈ పుస్తకాలే కీలకం..
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను (NCERT Books) క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన కీలక కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో ఇవెంతో మేలు చేస్తాయి. వీటికి తోడు నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్స్‌ను ఎంచుకోండి. ఉచితంగా లభించే ఆన్‌లైన్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాంలను సమర్థంగా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోండి.
ప్రశాంతత ముఖ్యం..
మీరు చదివే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఫోన్‌లు, సోషల్ మీడియా వంటివి మీ దృష్టిని మళ్లిస్తాయి. అందువల్ల చదివే సమయంలో వాటికి దూరంగా ఉండేలా నియంత్రించుకుంటూ ప్రిపరేషన్‌పై ఫోకస్ పెట్టండి.
సీబీఎస్‌ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేశారా?
ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్..
చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు సీనియర్ల, లెక్చరర్ల, నిపుణుల సలహాలు తీసుకోవాలి. పునరుశ్చరణ, ప్రశ్నల సాధన, సందేహ నివృత్తి కోసం ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను తెలివిగా ఉపయోగించుకొనే నేర్పు అలవాటు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టులోని ముఖ్యంశాలనూ నోటు పుస్తకంలో రాసుకుంటే మరింత ప్రయోజనం.
ఆరోగ్యం జాగ్రత్త!
ప్రిపరేషన్ సమయంలో కొందరు విద్యార్థులు తీవ్ర ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకొనేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.