Soft skills for workplace | ఈ సాఫ్ట్‌స్కిల్స్‌ మీలో ఉన్నాయా? వర్క్‌ప్లేస్‌లో వీరికే అధిక డిమాండ్‌!

Soft skills for workplace | ఈ సాఫ్ట్‌స్కిల్స్‌ మీలో ఉన్నాయా? వర్క్‌ప్లేస్‌లో వీరికే అధిక డిమాండ్‌!

రోజురోజుకీ మారిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్‌ వర్క్‌ కల్చర్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చేశాయి.

Eenadu icon
By Education News Team Published : 08 Jul 2025 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకీ మారిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్‌ వర్క్‌ కల్చర్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చేశాయి. రంగం ఏదైనా సరే.. తట్టుకొని నిలబడాలంటే కేవలం టెక్నికల్‌ స్కిల్స్‌ మాత్రమే ఉంటే సరిపోదు. వీటికి సాఫ్ట్‌స్కిల్స్‌ని సైతం జోడించిన వారే తామెంచుకున్న రంగంలో దూసుకెళ్తున్నారు. అధునాతన వర్క్‌ప్లేస్‌(workplace)లో రాణించి మీ ప్రత్యేకతను చాటుకొవాలంటే కొన్ని సాఫ్ట్‌స్కిల్స్‌ సైతం అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. 

క్రిటికల్‌ థింకింగ్‌.. నేటి పోటీ ప్రపంచంలో మంచి జాబ్‌ సాధించాలంటే ఈ నైపుణ్యమే కీలకం. క్రిటికల్‌గా ఆలోచిస్తూ.. నిత్య నూతనంగా ఉండే అభ్యర్థులకే ప్రముఖ కంపెనీలు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఈ నైపుణ్యం ఉద్యోగులు సమస్యలను విశ్లేషించి, స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతుంది. 

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.. జాబ్‌ మార్కెట్‌కనుగుణంగా లేకపోతే అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కళాశాలలో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ స్కిల్స్‌ నేర్చుకొనే ప్రయత్నం చేస్తేనే  అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ఉద్యోగాన్వేషణలో మీకు అవెంతో ప్లస్‌ అవుతాయి. ఏ ఉద్యోగానికైనా కచ్చితంగా కావాల్సింది భావ వ్యక్తీకరణ నైపుణ్యం (Communication Skills). ఎదుటి వారికి మీరేం చెప్పాలనుకొంటున్నారో సమర్థంగా వ్యక్తపరిచేందుకు ఈ నైపుణ్యమే కీలకం.

క్రియేటివిటీ.. ఏ రంగంలో రాణించాలన్నా సృజనాత్మకత అవసరం. కొత్తగా ఆలోచించేవారు సవాళ్లకు సరైన సమయంలో వినూత్న పరిష్కారాలను చూపించగలరు. అందుకే ఈ నైపుణ్యం ఉన్నవారిని తీసుకొనేందుకు కంపెనీలు ఆసక్తిచూపుతుంటాయి. 

ఇమిడిపోయే స్వభావం.. కేవలం సబ్జెక్టుపై పట్టు ఉన్నంత మాత్రాన సరిపోదు. బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, ఛాలెంజ్‌లను స్వీకరించగలగడం, నాయకత్వ లక్షణాలు (Leadership Skills), కస్టమర్‌ సర్వీస్‌- మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌ (Time Management), ప్రపంచ మార్కెట్‌కు అవసరమయ్యే నైపుణ్యాలకనుగుణంగా అప్‌డేట్‌ అయితే.. ఏ కంపెనీలూ మిమ్మల్ని వదులుకోవు.

  • ఓపెన్‌ మైండ్‌(Open Mind)తో పని చేయడమూ మరో కీలక నైపుణ్యమే. ఏదైనా కంపెనీలో ఒక హోదాలో పనిచేస్తే.. కొత్త కంపెనీకి మారేటప్పుడు అదే పనిని అక్కడ విభిన్నంగా చేయాల్సి రావొచ్చు. అందువల్ల అక్కడి పరిస్థితికి అనుగుణంగా పని చేసేందుకు ఈ నైపుణ్యం అవసరం. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండటం ఉద్యోగులు/ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం. 

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం, టీమ్‌ సభ్యులతో (Team Work) కలిసి ఉత్సాహంగా పనిచేయగలగడం, సమస్యలకు పరిష్కారాలు చూపగలగడం (Problem solving skills), భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ (Soft skills) ఎంతో కీలకం. దీనికితోడు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అలవర్చుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకొనే వీలుంటుంది.

  • వీటితో పాటు నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవడం, గెలుపోటములను సమంగా స్వీకరించే స్వభావం, సహనశీలత వంటి లక్షణాలు మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా ఉంచడమే కాదు.. పని ప్రదేశంలో ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలుపుతాయి.