UPSC | ‘సివిల్స్‌’లో ఇద్దరికీ ఒకే ర్యాంకు వివాదంపై యూపీఎస్సీ క్లారిటీ

UPSC | ‘సివిల్స్‌’లో ఇద్దరికీ ఒకే ర్యాంకు వివాదంపై యూపీఎస్సీ క్లారిటీ

ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాల్లో (UPSC Civils 2026 fianal Results) ఆకాంక్ష సింగ్‌ అనే పేరు ఉన్న వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతులకు ఒకే ర్యాంకు వచ్చిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Eenadu icon
By Education News Team Updated :09 Mar 2026 18:52 IST

పట్నా: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాల్లో (UPSC Civils 2026 fianal Results) ఆకాంక్ష సింగ్‌ అనే పేరు ఉన్న వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతులకు ఒకే ర్యాంకు వచ్చిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విచిత్ర వివాదంపై తాజాగా యూపీఎస్సీ స్పందించింది. 301వ ర్యాంకు ఎవరికి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మార్చి 6న యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆకాంక్ష సింగ్‌ అనే ఒకే పేరుతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు 301 ర్యాంకు సాధించినట్లుగా క్లెయిమ్‌ చేసుకున్నట్లు పలు మీడియా కథనాల్లో వచ్చింది. ఈ విషయంలో కమిషన్‌ రికార్డుల ప్రకారం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (మెయిన్‌) తుది ఫలితాల్లో 301వ ర్యాంకు సాధించిన అభ్యర్థి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజిపుర్‌కు చెందిన ఆకాంక్ష సింగ్‌ (రోల్‌ నంబర్‌ 0856794) 301వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి పేరు రంజిత్‌ సింగ్‌ కాగా, తల్లి పేరు నీలమ్‌ సింగ్‌’’ అని యూపీఎస్సీ తేల్చి చెప్పింది.

అసలేం జరిగిందంటే?

సివిల్స్‌ ఫలితాలు వెల్లడవ్వగానే.. బిహార్‌లోని ఆరా పట్టణానికి చెందిన ఆకాంక్ష సింగ్‌ పేరుతో 301వ ర్యాంకు ప్రకటన బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈమె నిషేధిత రణవీర్‌ సేన వ్యవస్థాపకుడైన బ్రహ్మేశ్వర్‌ సింగ్‌ మనవరాలు. మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని గాజీపుర్‌ నివాసి అయిన ఆకాంక్ష సింగ్‌ అనే మరో అభ్యర్థి ఆ ర్యాంకు తనకు వచ్చినదేనని చెప్పారు. తాను పట్నా ఎయిమ్స్‌లో గైనకాలజిస్టుగా పనిచేస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే, వీరిద్దరి ఫొటోలతో ఒకే పేరు, రోల్‌ నంబరు ఉన్న అడ్మిట్‌ కార్డు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలోనూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా యూపీఎస్సీ అధికారులు స్పష్టత ఇచ్చారు. యూపీకి చెందిన ఆకాంక్ష సింగ్‌కే 301వ ర్యాంకు వచ్చినట్లు ప్రకటించారు.