UPSC Civils 2025 Results| సివిల్స్‌ ఫలితాల హైలైట్స్‌: టాపర్ల ఆప్షనల్‌ సబ్జెక్టులేంటో తెలుసా? 

UPSC Civils 2025 Results| సివిల్స్‌ ఫలితాల హైలైట్స్‌: టాపర్ల ఆప్షనల్‌ సబ్జెక్టులేంటో తెలుసా? 

యూపీఎస్సీ సివిల్స్‌ 2025 తుది ఫలితాలు (UPSC Civils 2025 Results) విడుదలయ్యాయి. తుది ఫలితాల్లో మొత్తంగా 958 మంది అభ్యర్థులు ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌ తదితర సర్వీసులకు అర్హత సాధించారు.

Eenadu icon
By Education News Team Updated :06 Mar 2026 18:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 తుది ఫలితాలు (UPSC Civils 2025 Results) విడుదలయ్యాయి. మొత్తం 1087 ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించిన తుది పరీక్షా ఫలితాల్లో 958 మంది అభ్యర్థులు ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌ తదితర సర్వీసులకు అర్హత సాధించారు. గతేడాది మే 25న నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు 9,37,876మంది దరఖాస్తు చేసుకోగా.. 5,76,793 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 14,161 మంది మెయిన్‌ రాత పరీక్షకు అర్హత సాధించారు. ఆగస్టులో మెయిన్‌ పరీక్ష జరగ్గా.. 2736మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికయ్యారు. వీరికి డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పలు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ.. 958మంది (659మంది పురుషులు, 299 మహిళలు)ని పలు సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేసింది. ఈ పరీక్షల్లో టాప్‌-5 ర్యాంకర్ల విద్యార్హతలు, సివిల్స్‌ లక్ష్యసాధనకు మెయిన్‌ రాత పరీక్షలో వారు ఎంచుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టులేంటో పరిశీలిస్తే..

  • అనూజ్‌ అగ్నిహోత్రి: రాజస్థాన్‌కు చెందిన అనూజ్‌ (Anuj Agnihotri) సివిల్స్‌ ఫలితాల్లో  మొదటి ర్యాంకుతో సత్తా చాటారు. ఆయనకు ఇది మూడో ప్రయత్నం కావడం గమనార్హం. అనూజ్‌  మెయిన్ పరీక్షలో మెడికల్‌ సైన్స్‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. అనూజ్‌ ఎయిమ్స్‌ జోధ్‌పుర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.
  • రాజేశ్వరి సువే (Rajeshwari Suve): ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్‌ గ్రాడ్యుయేట్‌.  తమిళనాడులోని చెన్నైలో అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పట్టా అందుకున్న ఆమె సివిల్స్‌లో రెండో ర్యాంకుతో సత్తా చాటారు.  సోషియాలజీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. 
  • ఆకాన్ష్‌ ధుల్‌ (Akansh Dhull): దిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్‌ గ్రాడ్యుయేట్‌.  కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని మూడో ర్యాంకుతో మెరిశారు.
  • భార్గవ్‌ ఝున్‌ఝున్‌వాలా (Raghav Jhunjhunwala): దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్‌- ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఎకనమిక్స్‌ను తన ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని నాలుగో ర్యాంకుతో సత్తా చాటారు. 
  • ఇషాన్‌ భట్నాగర్‌ (Ishan Bhatnagar ): దిల్లీ నేషనల్‌ లా యూనివర్సిటీ నుంచి  బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) పూర్తి చేశారు. సోషియాలజీని తన ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని ఐదో ర్యాంకు సాధించారు.

మరోవైపు, సివిల్స్‌లో సత్తా చాటిన టాప్‌ 25 మంది అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14మంది పురుషులు ఉండటం విశేషం.  వీరంతా ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌, లా, మెడికల్‌ సైన్స్‌, మాస్‌ మీడియా వంటి సబ్జెక్టుల్లో ఐఐటీ, ఐఐటీ, ఎన్‌ఎల్‌యూ, ఎయిమ్స్‌, డీటీయూ, అన్నా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి తదితర ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారే.   అలాగే, ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, కెమిస్ట్రీ, ఎకనమిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, హిస్టరీ, మ్యాథమెటిక్స్‌, మెడికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్‌ ఛాయిస్‌గా ఎంచుకొని సివిల్స్‌లో మెరిశారు.