UPSC Civils 2025 Results | టీసీఎస్‌లో జాబ్‌ వద్దనుకొని.. సివిల్స్‌లో మెరిసిన ‘సృజన’

UPSC Civils 2025 Results | టీసీఎస్‌లో జాబ్‌ వద్దనుకొని.. సివిల్స్‌లో మెరిసిన ‘సృజన’

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో(UPSC Civils Results 2025) తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

Eenadu icon
By Education News Team Updated :06 Mar 2026 22:42 IST

పెద్దపల్లి: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో(UPSC Civils Results 2025) తెలంగాణకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 20 మంది ఎంపికయ్యారు. పెద్దపల్లికి చెందిన గుడెల్లి సృజన జాతీయస్థాయిలో 55వ ర్యాంకుతో మెరిశారు. గతేడాది టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్షల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన ఆమె.. పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతూనే సన్నద్ధమై ‘సివిల్స్‌’ కలను సాకారం చేసుకున్నారు. గతంలో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చినా వదిలేసి తన లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషిచేసి చివరకు అపూర్వ విజయం సాధించారు.

తల్లి ప్రోత్సాహం.. తనయ ప్రయత్నం

పిల్లల్లోని జిజ్ఞాస, ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఎంత ఉన్నత శిఖరాలకు చేరతారో చెప్పేందుకు సృజన సాధించిన ఈ అపూర్వ విజయమే ఓ గొప్ప ఉదాహరణ అని చెప్పొచ్చు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన గుడెల్లి రాణి పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె భర్త గుడెల్లి రాజేశం సైతం పదో తరగతి పూర్తి చేసి సింగరేణి కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. తమ ముగ్గురు పిల్లలకు చక్కని విద్యను అందించాలనే లక్ష్యంతో రాణి ఓపెన్ డిగ్రీ చదివి.. వారికి ట్యూటర్‌గా మారారు. పిల్లలకు చదువులో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారిని ప్రోత్సహించారు. తల్లి ప్రోత్సాహానికి తగ్గట్టే ఆ ముగ్గురు పిల్లలూ చదువుల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పెద్ద కుమారుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేసి ప్రస్తుతం సినీ రంగంలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు ఎన్ఐటీలో అర్కిటెక్చర్ కోర్సు పూర్తిచేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సృజన సైతం ప్రాంగణ నియామకాల్లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చినప్పటికీ వదులుకొని.. సివిల్ సర్వీస్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 

ఐదో ప్రయత్నంలో నెరవేరిన కల

పదో తరగతి వరకు సెంటినరీ కాలనీలోని వాణి సెకండరీ పాఠశాలలో చదువుకున్న సృజన.. ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో శ్రీచైతన్య కళాశాలలో, బీటెక్‌ సెంటినరీ కాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో పూర్తి చేశారు. సివిల్ సర్వీస్ సాధించాలనే లక్ష్యంతో దిల్లీకి వెళ్లి ఐదేళ్లు కోచింగ్ తీసుకున్నారు. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విజయం లభించలేదు. ఈలోగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సన్నద్ధమయ్యారు. గతేడాది గ్రూప్-1లో డీఎస్పీగా ఉద్యోగం సాధించారు. ఒకవైపు పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూనే మరోవైపు సివిల్ సర్వీస్ పరీక్షలకు సమాయత్తమై ఐదో ప్రయత్నంలో సివిల్స్‌ కలను సాకారం చేసుకున్నారు.

తెలంగాణ నుంచి సివిల్స్‌కు 20మంది ఎంపిక.. జాబితా ఇదే..

text......