SSC 2026 Exams| టెన్త్ విద్యార్థులకు విజయోస్తు.. కలెక్టర్ గారి సప్త సూత్రాలివిగో!
త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ లేఖ రాశారు.
By Education News Team
Published :05 Mar 2026 17:43 IST
https://results.eenadu.net/education-news/jogulamba-gadwal-collector-writes-a-letter-to-SSC-students-for-exams
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలు(SSC Exams 2026) రాసే విద్యార్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ లేఖ రాశారు. తద్వారా పరీక్షల పట్ల విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. స్పష్టమైన లక్ష్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పదో తరగతి పరీక్షలే జీవిత ప్రయాణంలో అత్యంత కీలక మైలురాయిగా పేర్కొన్న కలెక్టర్.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఇవే గట్టి పునాది వేస్తాయని పేర్కొన్నారు. అందువల్ల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో కృషిచేయాలన్నారు. ధైర్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఈ ఏడు సూత్రాలు విద్యార్థులకు దిక్సూచిలా పనిచేస్తాయంటూ పలు కీలక సూచనలు చేశారు.
- లక్ష్యాన్ని నిర్దేశించుకోండి: మీరు సాధించాలనుకునే మార్కులను స్పష్టంగా నిర్ణయించుకోండి. అన్ని సబ్జెక్టులకు కలిపి 550 కంటే ఎక్కువ మార్కులు పొందాలంటే దృఢమైన సంకల్పాన్ని పెట్టుకోండి. స్పష్టమైన లక్ష్యం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తుంది.
- సమయ పాలనతో కష్టపడి చదవండి: సమయం అమూల్యం. వార్షిక పరీక్షలకు ముందున్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలి. సెల్‌ఫోన్, టీవీ వంటి ఏకాగ్రతను దెబ్బతీసే అలవాట్లను తగ్గించండి.
- ప్రణాళికతో చదువుతూ రివిజన్ చేయండి: సమయ పట్టిక రూపొందించుకొని రోజూ చదవాల్సిన అంశాలను నిర్దేశించుకోండి. కఠినమైన సబ్జెక్టులు, ముఖ్యమైన అధ్యాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ప్రధానంగా గణితం వంటి క్లిష్టమనిపించే సబ్జెక్టులపై అదనపు దృష్టిపెట్టి ముఖ్యమైన కాన్సెప్టులపై పట్టు సాధించాలి. చదివిన పాఠాలను తరచూ పునశ్చరణ చేయడం ద్వారా అవి బాగా గుర్తుండిపోతాయి.
- నిరంతర ప్రాక్టీస్: రోజూ చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయండి. గత పరీక్షల ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లతో పాటు ముఖ్యమైన అంశాలను రాయడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది
- అందమైన చేతి రాత : చదువుతున్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ ముఖ్యాంశాలను రాసుకోవడం ద్వారా మీ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పరీక్షలో మంచి మార్కులు పొందాలంటే మీ చేతిరాత స్పష్టంగా, చదవడానికి సులభంగా ఉండాలి. అందమైన చేతిరాత మీ సమాధానాలకు అదనపు విలువను జోడిస్తుంది.
- ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం: ‘నేను సాధించగలను’ అనే నమ్మకం మీలో బలంగా ఉండాలి. అపజయం వచ్చినా కుంగిపోవద్దు. అది ఓటమి కాదు.. మిమ్మల్ని విజయానికి దగ్గర చేసే మార్గం.
- ఆరోగ్యమే మహాభాగ్యం: సమతుల ఆహారం, సరిపడా నిద్ర, రోజూ తేలికపాటి వ్యాయామం మీ శరీరానికి, మెదడుకు శక్తినిస్తాయి. రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. సానుకూల ఆలోచనలు మీ మనసును ప్రశాంతంగా, ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి.