Postal jobs| పోస్టల్‌లో 28వేల జీడీఎస్ పోస్టులు.. ఫలితాలు ఎప్పుడంటే?
గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసి మెరిట్ జాబితా కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ అప్‌డేట్ మీకోసమే!
By Education News Team
Updated :03 Mar 2026 17:38 IST
https://results.eenadu.net/education-news/Postal-GDS-2026-Merit-List-update
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేశారా? మెరిట్ జాబితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ అప్‌డేట్ మీకోసమే! దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్‌లో 28వేలకు పైగా భర్తీకి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ లేకుండా కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే భర్తీ చేసే ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను తపాలాశాఖ అధికారులు అతి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది తొలి మెరిట్ లిస్ట్‌ని దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన కేవలం 18 రోజుల్లోనే విడుదల చేశారు. ఈ ఏడాదీ అదే తరహాలో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. (India Post GDS Result 2026)
2025లో దాదాపు 21 వేల జీడీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. మార్చి 21న తొలి మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో మార్చి 4న లేదా మార్చి తొలి వారంలోనే పోస్టల్ జీడీఎస్ మెరిట్ జాబితా-1 విడుదలయ్యే అవకాశం ఉంది. తొలి మెరిట్ జాబితా విడుదలైన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఫెయిల్ కావడం లేదా డ్రాప్ అవ్వడం వంటి కారణాలతో ఖాళీలు భర్తీకాకపోతే.. తదుపరి మెరిట్ లిస్ట్‌లను విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఈ తరహాలో తొలి మెరిట్ లిస్ట్ జారీ అయిన దాదాపు నెల రోజులకు రెండో మెరిట్ జాబితా విడుదలవుతుంది. గత నోటిఫికేషన్‌లో 21వేల పోస్టుల భర్తీకి మొత్తంగా ఆరు మెరిట్ జాబితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తంగా 28,636 బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)/ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఏపీ సర్కిల్‌లో 1060, తెలంగాణ సర్కిల్‌లో 608 ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే.