ఈ 32 యూనివర్సిటీలు ఫేక్‌.. ఆ డిగ్రీలు చెల్లవ్‌!

ఈ 32 యూనివర్సిటీలు ఫేక్‌.. ఆ డిగ్రీలు చెల్లవ్‌!

దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్‌ నాటికి దేశ వ్యాప్తంగా 22 ఫేక్‌ యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 32కి చేరడం గమనార్హం.

Eenadu icon
By Education News Team Updated :22 Feb 2026 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల (fake universities in India) సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌ నాటికి దేశ వ్యాప్తంగా 22 ఫేక్‌ యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 32కి చేరడం గమనార్హం. యూనివర్సిటీల్లో చేరాలనుకొనే విద్యార్థుల అవసరాన్ని, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొనేందుకు నకిలీ వర్సిటీలు(Fake Universities)పుట్టుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. అడ్మిషన్ల సీజన్‌ నేపథ్యంలో యూజీసీ వెల్లడించిన జాబితా ప్రకారం దేశంలో ఫిబ్రవరి నాటికి 32 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దేశ రాజధాని నగరం దిల్లీలోనే 12 నకిలీ వర్సిటీలు ఉండగా.. యూపీ (4), ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లో రెండేసి చొప్పున.. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఒక్కొక్కటి ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా నకిలీ వర్సిటీల జాబితా కోసం క్లిక్‌ చేయండి

అప్రమత్తతతోనే ‘నకిలీ’కి చెక్‌!

నకిలీ యూనివర్సిటీల మాయలో పడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు.. సమయం, భవిష్యత్తు నాశనమవుతుంది. ఈ నేపథ్యంలో నకిలీ యూనివర్సిటీలను(Fake Universities) గుర్తించి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు యూజీసీ విజ్ఞప్తి చేసింది. నిజమైన యూనివర్సిటీలు ఏవైనా సరే యూజీసీ లేదా ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఆ విద్యా సంస్థలకు మాత్రమే విద్యార్థులకు డిగ్రీలు మంజూరు చేసే అధికారం ఉంది. నకిలీ విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలకు ఏమాత్రం చట్టబద్ధత ఉండదు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ సర్వీసులు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు ఇవి చెల్లుబాటు కావు. అందువల్ల మీరు చదవాలనుకొంటున్న యూనివర్సిటీ గురించి తెలుసుకొనేందుకు కొంచెం సమయం కేటాయించి అధ్యయనం చేయండి. బాగా స్టడీ చేశాకే మీకు అన్ని విధాలా నప్పే వర్సిటీని ఎంపిక చేసుకోవడం తెలివైన పని.

ఫేక్‌ యూనివర్సిటీలను గుర్తించడం ఎలా?

  • విద్యార్థుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నకిలీ వర్సిటీల ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. తమ వర్సిటీ/విద్యా సంస్థలో చేరాలంటూ పదే పదే వెంటపడి వేధిస్తే సందేహించాల్సిందే!
  • సాధారణ సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే కోర్సుల్ని పూర్తి చేయిస్తామని చెబుతుండటం
  • తక్కువ ఫీజులతో కోర్సుల్ని అందించడంతో పాటు, ప్లేస్‌మెంట్‌ హామీలు గుప్పిస్తుండటం
  • యూనివర్సిటీలో సిబ్బంది, అందించే కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం వంటి అసాధారణ లక్షణాలను గమనిస్తే అప్రమత్తంగా ఉండటమే మేలు

ఇలా చేయండి..

  • మీరు చేరాలనుకొనే వర్సిటీ విశ్వసనీయతను తెలుసుకొనేందుకు ఆ కాలేజీలో చదివిన, చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.  
  • యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు సందర్శించి అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోండి. 
  • నకిలీ యూనివర్సిటీలు చాలా వరకు క్యాంపస్‌ లేకుండా ఆన్‌లైన్‌లోనే పనిచేస్తుంటాయి.
  • నిజమైన వర్సిటీలకైతే భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు ఉంటాయి. అందువల్ల మీరు చేరాలనుకొనే విద్యాసంస్థ క్యాంపస్‌ని ఒకసారి సందర్శించడం మేలు.
  • తక్కువ ఫీజులకే కోర్సులంటే తొందరపడి చేరిపోవద్దు. దానిపై కాస్త అధ్యయనం చేయండి. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత వర్సిటీల రివ్యూలనూ చూడండి.
  • ఆయా వర్సిటీలు అందించే కోర్సులకు ఏఐసీటీఈ, న్యాక్‌ వంటి ఇతర సంస్థల గుర్తింపు ఉందో లేదో చెక్‌ చేయండి.