tg eapcet 2026 | తెలంగాణ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు షురూ.. ఈ కొత్త మార్పులు తెలుసా?
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్(TG EAPCET 2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
By Education News Team
Updated :19 Feb 2026 14:28 IST
https://results.eenadu.net/education-news/tg-eapcet-2026-registrations-begins
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్(TG EAPCET 2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 4 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఈసారి జేఎన్టీయూ- హైదరాబాద్ ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
4 కీలక మార్పులివే..
- పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎగ్జామ్ రాసిన వెంటనే ప్రిలిమినరీ కీ ఆధారంగా మార్కులు స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంకు వస్తుందనే అంచనా కోసం గత రెండేళ్ల గణాంకాలనూ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనివల్ల విద్యార్థులు కొంత ధీమాతో పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
- ఈ ఏడాది ఫోన్ ద్వారా ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ/మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు కంప్యూటర్/ల్యాప్‌టాప్ వంటివి అందుబాటులో ఉండవు గనక ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. డెస్క్‌టాప్ తరహాలోనే మొబైల్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. (యూజర్ గైడ్ కోసం క్లిక్ చేయండి)
- ఎప్‌సెట్ అప్లికేషన్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం Know your registration status అనే ఆప్షన్ ఇస్తున్నారు. స్టేటస్ తెలుసుకొనేందుకు మీ ట్రాన్సాక్షన్ ఐడీ, మొబైల్ నంబర్, క్వాలిఫైడ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
- కొందరు విద్యార్థులు దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీసీ/బైపీసీ వంటివి తప్పుగా ఎంటర్ చేస్తుంటారు. అందువల్ల ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకొని తప్పుగా ఆప్షన్ పెట్టే విద్యార్థులను హెల్ప్‌డెస్క్ నుంచి సంప్రదించి ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే ఏర్పాట్లు చేశారు.
ఎప్‌సెట్ మాక్‌టెస్టుల కోసం క్లిక్ చేయండి