UPSC CSE 2025 toppers Marks| ‘సివిల్స్‌’ విజేతల మార్కులు విడుదల.. టాపర్లు సాధించిన స్కోరెంతంటే?

UPSC CSE 2025 toppers Marks| ‘సివిల్స్‌’ విజేతల మార్కులు విడుదల.. టాపర్లు సాధించిన స్కోరెంతంటే?

ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2025 ఫలితాలను (UPSC Civils 2025 Result) విడుదల చేసిన యూపీఎస్సీ.. విజేతలు సాధించిన మార్కులను మంగళవారం ప్రకటించింది.

Eenadu icon
By Education News Team Updated :10 Mar 2026 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సివిల్‌ సర్వీసెస్‌(UPSC CSE 2025)లో చేరాలనేది దేశంలో లక్షలాది మంది అభ్యర్థులకు ఓ గొప్ప స్వప్నం. దీన్ని సాకారం చేసుకొనేందుకు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి చదువుతుంటారు. లక్షలాది మంది ప్రిలిమ్స్‌ పరీక్ష రాస్తే.. అన్ని దశలు దాటుకొని చివరకు ఉద్యోగాలకు ఎంపికయ్యేది మాత్రం వందల్లోనే ఉంటారు. గతేడాది యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు 9,37,876మంది దరఖాస్తు చేసుకోగా.. 5,76,793 మంది మాత్రమే హాజరయ్యారు. మెయిన్‌ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ అనంతరం యూపీఎస్సీ 958మందిని సర్వీసులకు సిఫారసు చేసింది. అందువల్ల సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అవ్వాలనే లక్ష్యం ఒక్కటే ఉంటే చాలదు.. దీనికి ఎంతో కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు కఠోర శ్రమ, కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2025 ఫలితాలను (UPSC Civils 2025 Result) విడుదల చేసిన యూపీఎస్సీ.. విజేతలు సాధించిన మార్కులను మంగళవారం ప్రకటించింది. సివిల్స్‌లో టాపర్లుగా నిలిచిన తొలి ఐదుగురితో పాటు 200లోపు ర్యాంకులతో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. 

తొలి ఐదుగురు టాపర్ల స్కోరు ఇదే..

సివిల్స్‌ మెయిన్‌, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్‌/రాతపరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయించారు. అయితే, యూపీఎస్సీ సివిల్స్‌ -2025 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన అనూజ్‌ అగ్నిహోత్రి 1071 మార్కులు (రాత పరీక్షలో 867 , ఇంటర్వ్యూలో 204 మార్కులు) సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అలాగే, రెండో ర్యాంకర్‌ రాజేశ్వరి సువె 1067 మార్కులు (రాతపరీక్షలో 865, ఇంటర్వ్యూ 202 మార్కులు), మూడో ర్యాంకుతో మెరిసిన ఆకాన్ష్‌ ధుల్‌ 1057 మార్కులు (రాతపరీక్ష 864, ఇంటర్వ్యూ 193), నాలుగో ర్యాంకర్‌ రాఘవ్‌ ఝున్‌ఝున్‌వాలా 1042 (847, 195 మార్కులు), ఐదో ర్యాంకర్‌ ఇషాన్‌ భట్నాగర్‌ 1038 (823, 215) మార్కులు చొప్పున సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది.

సివిల్స్‌-2025 విజేతల మార్కుల కోసం క్లిక్‌ చేయండి

తెలుగు రాష్ట్రాల నుంచి 200 లోపు ర్యాంకర్ల మార్కులు ఇవే..

మరోవైపు, సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచి 23వ ర్యాంకుతో మెరిసిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్‌ చంద్రకు 1023 (రాత పరీక్షలో 832, ఇంటర్వ్యూలో 191) మార్కులు రాగా.. 55వ ర్యాంకుతో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 1011 (840, 171) మార్కులు సాధించారు. అలాగే,  విశాఖకు చెందిన 103వ ర్యాంకర్‌ బిపుల్‌ గుప్తాకు 1000 (807, 193), హన్మకొండకు చెందిన 123వ ర్యాంకర్‌ తరుణ్‌ తేజకు 995 (830, 165), తాడిపత్రికి చెందిన 125వ ర్యాంకర్‌ సాయికృష్ణకు 995 (816, 179), హన్మకొండకు చెందిన 150వ ర్యాంకర్‌ కొలిపాక శ్రీకృష్ణ సాయికి 990 (797, 193), రంగారెడ్డి జిల్లాకు చెందిన 178వ ర్యాంకర్‌ బానోతు లక్ష్మీరచనకు 985(781, 204), హైదరాబాద్‌కు చెందిన 193వ ర్యాంకర్‌ డీఎస్‌కే ప్రచేత్‌కు 984 మార్కులు (రాత పరీక్షలో 780, ఇంటర్వ్యూలో 204 మార్కులు) చొప్పున వచ్చాయి.