UPSC Civils 2025 Results | అల్లుడు క్రికెట్లో.. మామ ‘సివిల్స్’లో అదుర్స్!
వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) క్రికెట్లో శతకాలతో చెలరేగితే.. ఇప్పుడు అతడి మేనమామ అభిషేక్ చౌహాన్(Abhishek Chauhan)సివిల్స్‌లో అదరగొట్టాడు.
By Education News Team
Published :07 Mar 2026 16:12 IST
https://results.eenadu.net/education-news/Cricketer-Vaibhav-Uncle-Cracks-UPSC-Exam
ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) క్రికెట్లో ఓ సంచలనం. 14 ఏళ్ల వయసులోనే శతకాలతో చెలరేగి దేశం దృష్టినీ ఆకర్షించాడు. అయితే, ఇప్పుడు అతడి మేనమామ అభిషేక్ చౌహాన్(Abhishek Chauhan)సివిల్స్‌లో అదరగొట్టాడు. శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాల్లో తొలి ప్రయత్నంలో ఆలిండియా 102 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అల్లుడు క్రికెట్లో అదరగొడితే.. మామ సివిల్స్‌లో మెరిసి తమ జిల్లాకు గర్వకారణంగా నిలిచారంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
అభిషేక్ బిహార్‌లోని సమస్థిపుర్ జిల్లా మొహియుద్దీన్నగర్లోని రాజజన్ గ్రామానికి చెందిన వారు. తండ్రి డా.అభయ్‌కుమార్ సింగ్ ప్రస్తుతం నలంద ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా సర్వీసులందిస్తున్నారు. తల్లి అనురాధ రాజ్‌పుత్. వైభవ్ సూర్యవంశీకి అభిషేక్ మేనమామ కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ సివిల్స్‌లో విజయం సాధించడంపై వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ హర్షం వ్యక్తం చేశారు.
1999 నవంబర్‌లో పుట్టిన అభిషేక్.. చిన్నప్పట్నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవారు. ఎంటెక్‌లో బంగారుపతకం సాధించిన అతడు.. 2022 తర్వాత సివిల్స్ కోసం సన్నద్ధత మొదలు పెట్టి తొలి ప్రయత్నంలోనే తన సివిల్స్ కలను సాకారం చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందోత్సాహాలతో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.