UPSC CSE 2025 Results| ‘సివిల్స్‌’ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

UPSC CSE 2025 Results| ‘సివిల్స్‌’ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ - 2025 తుది ఫలితాలు(UPSC Civils 2025 final Results) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :06 Mar 2026 17:47 IST

UPSC CSE 2025 Results | ఇంటర్నెట్ డెస్క్‌: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (మెయిన్‌) - 2025 తుది ఫలితాలు (UPSC Civils 2025 final Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ తుది పరీక్షలో 958 మంది క్వాలిఫై అయ్యారని, వీరిలో జనరల్‌ కేటగిరీ నుంచి  317 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్‌ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఫలితాల్లో అనూజ్‌ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువే, ఆకాన్ష్‌ ధుల్‌ తొలి మూడు ర్యాంకులతో (Civils 2025 Toppers) సత్తా చాటగా.. పలువురు తెలుగు విద్యార్థులు సివిల్స్‌లో మెరిశారు. (UPSC Civils Final result 2025)

 సివిల్స్‌లో సత్తా చాటిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే 

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

  • అనూజ్‌ అగ్నిహోత్రి
  • రాజేశ్వరి సువే 
  • అకాన్ష్‌ ధుల్‌
  • రాఘవ్‌ ఝున్‌ఝున్‌వాలా
  • ఇషాన్‌ భట్నాగర్‌
  • జినియా అరోడా
  • ఏఆర్‌ రజా మొహియిద్దీన్‌
  • పక్షల్‌ సెక్రటరీ
  • అస్థా జైన్‌
  • ఉజ్వల్‌ ప్రియాంక్‌

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..

సివిల్స్‌ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జశ్వంత్‌ చంద్ర 23వ ర్యాంకుతో మెరవగా.. సృజన 55వ ర్యాంకు,  భానోత్‌ లక్ష్మీ రచన 178, డీఎస్‌కే ప్రచేత్‌ 193, ఎస్‌ వర్షిత్‌ రెడ్డి 259, ఎం.పవన్‌కుమార్ రెడ్డి 297, వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541, గుమ్మల శ్వేత 573, పల్లి ప్రమోద్‌ విష్ణు 640, వెలిమినేటి విజయసింహారెడ్డి 682, పోతుపురెడ్డి భార్గవ్‌ 738, పుడారి రాహుల్‌ 748, కుమ్మరి శ్రవణ్‌కుమార్‌ 768, అనిరుధ్‌ కత్తిమాని 786, కోరపోతుల శ్రీకర్‌రాజు 806, ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష 823, కట్టా ప్రత్యూష 908, గోగుల రాజశేఖర్‌ 920, గుగులోతు జితేందర్‌ నాయక్‌ 939వ ర్యాంకులతో తమ విశేష ప్రతిభను చాటారు. 

15 రోజుల్లోగా మార్కుల జాబితా

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (IAS), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (IFS), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (IPS) సహా పలు సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. గతేడాది సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. మే 25న జరిగిన ప్రిలిమ్స్‌లో సత్తా చాటిన వారికి 2025 ఆగస్టు 22 నుంచి 31 వరకు మెయిన్‌ పరీక్ష(UPSC CSE Main Exam) నిర్వహించారు. మెయిన్‌ పరీక్షలో అసాధారణ ప్రతిభను కనబరిచిన వారికి డిసెంబర్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దశల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్ష/నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం లేదా స్పష్టత కోసం ఫెసిలిటేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా వెళ్లి గానీ లేదా 23385271/23381125/23098543 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లోపు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.