JEE Main 2026| జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు రాలేదా? ఈ ఆప్షన్లూ చూడండి!

JEE Main 2026| జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు రాలేదా? ఈ ఆప్షన్లూ చూడండి!

జేఈఈ మెయిన్ (సెషన్‌-1) ఫలితాల్లో ఆశించినంత స్కోరు రాలేదని నిరుత్సాహపడుతున్నారా? ఈ ఒక్క పరీక్ష ఫలితమే మీ భవిష్యత్తు మొత్తాన్ని నిర్దేశించలేదని గుర్తుంచుకోండి.

Eenadu icon
By Education News Team Updated : 18 Feb 2026 18:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్ (సెషన్‌-1) ఫలితాల్లో (JEE Main 2026 Results) ఆశించినంత స్కోరు రాలేదని నిరుత్సాహపడుతున్నారా? ఈ ఒక్క పరీక్ష ఫలితమే మీ భవిష్యత్తు మొత్తాన్ని నిర్దేశించదని గుర్తుంచుకోండి. నిరాశ, నిస్పృహలతో విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా.. తదుపరి లక్ష్యం దిశగా రెట్టింపు ఉత్సాహంతో దృష్టి పెట్టడమే తెలివైన విద్యార్థి లక్షణం! అందువల్ల ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ చదవాలన్న మీ కల సాకారానికి ఇతర ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించి ఆ దిశగా ముందుకెళ్లడం ఉత్తమం. ఈ నేపథ్యంలో మీ ముందున్న బెస్ట్‌ ఆప్షన్లు ఇవే..!

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2.. మరింత కష్టపడితే..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలో ఆశించిన స్కోరు సాధించని విద్యార్థులకు సెషన్‌-2 ఓ సువర్ణావకాశం. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 2 నుంచి 9 మధ్య జరిగే ఈ పరీక్ష కోసం ఇప్పట్నుంచే సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీటు సాధించాలన్న మీ డ్రీమ్‌ని సాకారం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి మీ చేతిలో ఉన్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత కష్టపడి చదివితే ఈసారి విజయం మీదే!

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలలు/యూనివర్సిటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అనేక ప్రవేశ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని టాప్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీటు సాధించేందుకు టీజీ ఈఏపీసెట్, ఏపీ ఈఏపీసెట్‌ వంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు బిట్‌శాట్‌, VITEEE, SRM JEE వంటి పరీక్షల్ని సైతం రాసి దేశంలో ప్రఖ్యాత ప్రైవేటు వర్సిటీల్లో చేరే అవకాశాలనూ పరిశీలించవచ్చు. 

  • ఏపీ ఈఏపీసెట్‌ : ఏపీలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌కు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 3వరకు (ఆలస్య రుసుం లేకుండా) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12 నుంచి 20 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 1 నాటికి ఫలితాలు విడుదల చేస్తారు.
  • టీజీ ఎప్‌సెట్‌: తెలంగాణ ఎప్‌సెట్‌కు ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలై ఏప్రిల్‌ 4వరకు (ఆలస్యరుసుం లేకుండా) కొనసాగనుంది. ఈసారి ఎప్‌సెట్‌లో కొత్త మార్పులు చేపట్టారు. మే 4 నుంచి 11వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసిన వెంటనే విద్యార్థి ప్రిలిమినరీ కీ ఆధారంగా తన స్కోర్‌ని స్క్రీన్‌పైనే తెలుసుకొనే అవకాశం కల్పించారు.
  • BITSAT-2026: బిట్‌శాట్‌పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌కు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 15 - 17 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌ పరీక్షకు ఏప్రిల్‌ 20 నుంచి మే 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24 నుంచి 26 వరకు పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలను https://admissions.bits-pilani.ac.in/BITSAT_LP/index.htmlలో తెలుసుకోవచ్చు.
  • VITEEE: వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 28 నుంచి మే 3 వరకు పరీక్ష నిర్వహస్తారు. మే రెండో వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. మే రెండో వారంలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. https://viteee.vit.ac.in/లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
  • SRM JEEE: ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ పరీక్ష మూడు విడతల్లో నిర్వహిస్తారు. తొలి విడతకు ఏప్రిల్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విడతకు జూన్‌ 4వరకు; మూడో విడత పరీక్షకు జూన్‌ 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23 నుంచి 28వరకు ఫేజ్‌-1 పరీక్ష జరగనుండగా.. జూన్‌ 10 నుంచి 15వరకు ఫేజ్‌-2; జులై 4 నుంచి 5వ తేదీ వరకు ఫేజ్‌-3 పరీక్ష నిర్వహిస్తారు.పూర్తి సమాచారం https://applications.srmist.edu.in/లో చూడొచ్చు.