jee main 2026 toppers | జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. టాపర్లు వీరే..
జేఈఈ మెయిన్ ఫలితాల్లో (JEE Main 2026 Results) తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.
By Education News Team
Updated :16 Feb 2026 19:50 IST
https://results.eenadu.net/education-news/jee-main-2026-toppers-list
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో (JEE Main 2026 Results) తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా 12మంది 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టగా.. వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్, తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహిశ్వరి అద్భుత ప్రతిభను కనబరిచారు. పసల మోహిత్ కడప జిల్లాకు చెందిన విద్యార్థి కాగా.. నరేంద్ర బాబు గారి మహిత్ తిరుపతిలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం.
రాష్ట్రాల వారీగా టాపర్ల వివరాలను పరిశీలిస్తే.. శ్రేయస్ మిశ్రా (దిల్లీ), నరేంద్రబాబు గారి మహిత్ (ఏపీ), శుభమ్ కుమార్ (బిహార్), కబీర్ చిల్లార్ (రాజస్థాన్), చిరంజీబ్ కర్ (రాజస్థాన్), భవేశ్ పాత్రా (ఒడిశా), అనయ్ జైన్ (హరియాణా), అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్), పసల మోహిత్ (ఏపీ), మాధవ్ వైరాదియా (మహారాష్ట్ర), పురోహిత్ నిమయ్ (గుజరాత్), వివాన్ శరద్ మహిశ్వరి (తెలంగాణ) ఉన్నారు. పసల మోహిత్, వివాన్ శరద్ మహిశ్వరి 100 పర్సంటైల్ స్కోరుతో జనరల్ కేటగిరీలో టాపర్లుగా నిలవగా.. నరేంద్రబాబు గారి మహిత్ ఓబీసీ (ఎన్‌సీఎల్) కేటగిరీలో టాపర్‌గా నిలిచాడు.
మరోవైపు, 68మంది స్కోరును ఎన్‌టీఏ ప్రకటించలేదు. గుర్తింపు ధ్రువీకరణ తదితర అంశాల్లో అక్రమ పద్ధతులకు పాల్పడినందున వీరి ఫలితాలను ప్రకటించలేదని ఎన్‌టీఏ తెలిపింది. అలాగే, జేఈఈ మెయిన్ పేపర్ -2 (బీఆర్క్, బీ.ప్లానింగ్) ఫలితాలను తర్వాత వెల్లడించనున్నట్లు పేర్కొంది.