SSC GD Constable 2026 | 25,487 పోస్టులు.. ఎస్‌ఎస్‌సీ (జీడీ) కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా
కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(CAPFs) సహా వివిధ భద్రతా విభాగాల్లో 25వేలకు పైగా పోస్టుల భర్తీకి జరగాల్సిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష(SSC Constable-GD)లు వాయిదా పడ్డాయి.
By Education News Team
Updated :17 Feb 2026 20:42 IST
https://results.eenadu.net/education-news/SSC-GD-Constable-2026-CBT-exam-postponed
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(CAPFs) సహా వివిధ భద్రతా విభాగాల్లో 25వేలకు పైగా పోస్టుల భర్తీకి జరగాల్సిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష(SSC Constable-GD)లు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ నోటీసును విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలకు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీఏపీఎఫ్), ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జీడీ) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 25,487 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు జరుగుతాయని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం నోటీసులో పేర్కొనలేదు. అలాగే, ఈ పరీక్షకు స్లాట్ సెలక్షన్ సౌకర్యం అందుబాటులో ఉండదని నోటీసులో పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి ఎనిమిది లేదా పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, మీ పరీక్ష తేదీకి రెండు లేదా మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి తాజా అప్‌డేట్స్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని సూచించారు.