TG Inter Hall tickets | తెలంగాణ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు(TG Inter Hall tickets) విడుదలయ్యాయి.
By Education News Team
Updated : 19 Feb 2026 17:19 IST
https://results.eenadu.net/education-news/TG-Inter-halltickets-released
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు(TG Inter Hall tickets) విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు గురువారం వెల్లడించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ప్రిన్సిపాళ్లను కలిసి తీసుకోవచ్చని సూచించారు.
హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా బోర్డు విజ్ఞప్తి చేసింది. హాల్‌టికెట్లలో ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని తెలిపింది. అలాగే, విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌ను పంపిస్తున్నామని.. తద్వారా వారు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం కూడా కల్పించినట్లు బోర్డు పేర్కొంది. ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను మొత్తంగా 9.9లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.