ఐఐటీ మద్రాస్‌లో BSc చదువుతారా? సీట్లకు నో లిమిట్‌.. వయో పరిమితి లేదు!

ఐఐటీ మద్రాస్‌లో BSc చదువుతారా? సీట్లకు నో లిమిట్‌.. వయో పరిమితి లేదు!

విద్యార్థులతో పాటు జాబ్‌ చేస్తూ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Eenadu icon
By Education News Team Updated :22 Feb 2026 22:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యార్థులతో పాటు జాబ్‌ చేస్తూ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిజిటల్ యుగంలో మారుతోన్న జాబ్‌ మార్కెట్‌కనుగుణంగా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కోర్సుల్ని ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక వర్సిటీ.. తాజాగా మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(BS in Management and Data Science)కోర్సును తీసుకొచ్చింది. జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఈ సరికొత్త ప్రోగ్రామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నేటి డిజిటల్ యుగంలో డేటానే కొత్త కరెన్సీగా మారింది. దీనికి సరైన మేనేజ్‌మెంట్‌ తోడైతే గొప్ప విజయాలు సాధించవచ్చనే ఉద్దేశంతో ఈ రెండింటినీ మిళితం చేసేలా ఐఐటీ మద్రాస్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఈ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. డేటా ఆధారితంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలతో పాటు నిర్వహణ పరిజ్ఞానం అందించడం ద్వారా కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తు అవసరాలకు మానవవనరులను తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్‌ ప్రధాన లక్ష్యం.

12వ తరగతి తత్సమాన విద్యార్హత (పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ తప్పనిసరి) కలిగిన వారు ఎవరైనా ఈ కోర్సులో చేరొచ్చు. దీంట్లో చేరేందుకు వయో పరిమితి ఏమీ లేదు. అలాగే, సీట్ల సంఖ్య విషయంలోనూ పరిమితుల్లేవు. ఇది ఒక హైబ్రిడ్‌ విధానంలో అందించే ప్రోగ్రామ్‌. రికార్డు చేసిన లెక్చర్లతో పాటు లైవ్‌ సెషన్లూ అందుబాటులో ఉంటాయి. పరీక్షలు కేవలం ఆదివారాల్లో మాత్రమే ఉంటాయి. జాబ్‌ చేస్తున్న వారితో పాటు ఇతర కోర్సులను అభ్యసిస్తున్న వారికీ వెసులుబాటు ఉండేలా పరీక్షలను ఆదివారాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా ఐఐటీ మద్రాస్‌ నుంచి పూర్తిస్థాయి గుర్తింపు కలిగిన బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన అనంతరం కన్సల్టింగ్‌ - ఫైనాన్స్‌, టెక్నాలజీ, మ్యానుఫాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌, పాలసీ తదితర రంగాల్లో అద్భుతమైన ఉద్యోగవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. ఎక్కడి నుంచైనా  చదవగలిగే ఈ ప్రోగ్రామ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు రుసుం, మొత్తం ప్రోగ్రామ్ ఫీజు ఎంత, ఇతర విద్యార్హతలేంటీ? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?  తదితర పూర్తి వివరాలను https://study.iitm.ac.in/mg/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.