IIT Hyderabad Internship| ఐఐటీ హైదరాబాద్ గోల్డెన్ ఛాన్స్.. ‘ష్యూర్’ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రఖ్యాత సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్(IIT Hyderabad) విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. పరిశోధనల పట్ల ఆసక్తి కలిగిన వారి కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది.
By Education News Team
Updated :03 Mar 2026 15:55 IST
https://results.eenadu.net/education-news/IIT-Hyderabad-invite-applications-for-Summer-Internships
ఇంటర్నెట్ డెస్క్: ప్రఖ్యాత సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్(IIT Hyderabad) విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. పరిశోధనల పట్ల ఆసక్తి కలిగిన వారి కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ (SURE) కింద చేపట్టిన ఈ రెండు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హులైన, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10వరకు కొనసాగనుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
- మే 15 నుంచి జులై 14వరకు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు మొత్తంగా 250 మంది ఇంటర్న్‌లను (100 మంది విద్యార్థినులకు ఎక్స్‌క్లూజివ్‌గా అవకాశం) ఎంపిక చేస్తారు.
- ఈ ప్రోగ్రామ్‌లో కనీసం నెల రోజుల పాటు ఇంటర్న్‌గా చేయాల్సి ఉంటుంది. మొత్తంగా రెండు నెలల ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి రూ.15000 చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. నెల రోజుల పాటు చేస్తే రూ.7500, నెలన్నర పాటు చేస్తే రూ.10వేలు చొప్పున చెల్లిస్తారు.
- కేవలం నాన్ ఐఐటీ విద్యార్థుల కోసమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. ఎమ్మెస్సీ(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ), ఎంఏ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు బీటెక్ /బి.డిజైనింగ్ రెండు, మూడో సంవత్సరం (అన్ని బ్రాంచ్‌లు) లేదా ఇంటిగ్రేటెడ్ బీటెక్/ఎంటెక్ మూడు/నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు.
- విద్యార్థులు తమ మునుపటి ఏడాదిలో సాధించిన సీజీపీఏ లేదా పర్సెంటేజ్ స్కోరు ఆధారంగా ఈ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. అలాగే, దరఖాస్తు సమయంలో సంబంధిత విద్యాసంస్థ హెడ్/ప్రిన్సిపల్ ధ్రువీకరణ తప్పనిసరి.
- ఫుల్‌టైం/రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం. దరఖాస్తులను ప్రాథమికంగా స్క్రీనింగ్ చేసి సంబంధిత విభాగం ఎంపిక మేరకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
- ఈ ఫలితాలను ఏప్రిల్ 15న ప్రకటిస్తారు. అలాగే తమ వెబ్‌సైట్‌లోనూ జాబితాను ఉంచుతారు. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మే 15 నుంచి మొదలవుతుంది.
- హాస్టల్ సదుపాయం ఉచితమే. కానీ, ఫుడ్ ఛార్జీలను మాత్రం సదరు విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి