CBSE Scholarship | సీబీఎస్‌ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేశారా?
CBSE Scholarship | తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్ అందజేస్తోంది. అర్హులైన వారు అక్టోబర్ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Published :16 Sep 2024 15:13 IST
https://results.eenadu.net/news.aspx?newsid=160924
CBSE Single Girl Child Scholarship| ఇంటర్నెట్ డెస్క్: మీరు పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే, సీబీఎస్‌ఈ ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్‌షిప్(CBSE Merit Scholarship) మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్‌ను అందజేస్తోంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అక్టోబర్ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలివే..
రైల్వే జాబ్స్.. డిగ్రీతో 8,113 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
- తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌ను అమలు చేస్తున్నారు.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు నెలకు ₹500ల చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు.
- దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి.
- పదో తరగతి పరీక్షల్లో కనీసం 60శాతం మార్కులు(ఐదు సబ్జెక్టుల్లో) సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్ అవార్డుకు అర్హులు. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కన్నా మించి ఉండరాదు.
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 31వరకు వరకు కొనసాగుతుంది. దరఖాస్తులను ఆయా పాఠశాలలు నవంబర్ 7 వరకు వెరిఫికేషన్ చేయనున్నాయి.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. రెన్యువల్‌కు కూడా అక్టోబర్ 31వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి