CTET 2024 exam date revised | సీటెట్‌కు దరఖాస్తు చేశారా? పరీక్ష తేదీ మార్పు

CTET 2024 exam date revised | సీటెట్‌కు దరఖాస్తు చేశారా? పరీక్ష తేదీ మార్పు

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET December- 2024) తేదీని సీబీఎస్‌ఈ రీషెడ్యూల్‌ చేసింది.

Published : (20 Sep 2024 20:08) IST

CTET 2024 exam date revised| దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET- December 2024)కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సీటెట్‌ పరీక్షను తొలుత డిసెంబర్‌ 1న (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించగా.. తాజాగా మార్పు చేశారు. ఈ పరీక్షను డిసెంబర్‌ 15న నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పాలనా సంబంధమైన కారణాలతో ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేసినట్లు పేర్కొంది. మేరకు రివైజ్డ్‌ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. దరఖాస్తు తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. ఆంగ్లం/హిందీ భాషల్లో జరిగే ఈ పరీక్షకు అక్టోబర్‌ 16 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో ముఖ్యమైన పాయింట్లు..

  • సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. సీటెట్‌ (డిసెంబర్‌)కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
  • సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
  • మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
  • పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్‌ -1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు.
  • దరఖాస్తుల్లో తప్పులను అక్టోబర్‌ 21 నుంచి 25వరకు సవరణ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను పరీక్షకు రెండు రోజుల ముందు విడుదల చేస్తారు. ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌. పరీక్ష సిలబస్‌, ఇతర వివరాలతో కూడిన రివైజ్డ్‌ బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి.