campus placements | జాబ్ కొట్టాలంటే.. మార్కులే కావాలా ఏంటీ? HR నిపుణుల చిట్కాలివిగో!
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో హెచ్‌ఆర్ నిపుణులు సూచిస్తోన్న కొన్ని చిట్కాలు మీకోసం
Published :20 Sep 2024 05:49 IST
https://results.eenadu.net/news.aspx?newsid=190924
Campus Placements| క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో విద్యార్థులకు ఎన్నో అపోహలు వస్తుంటాయి. ‘ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకే అధిక ప్యాకేజీ వస్తుంది.. ఇలా ఉంటేనే ఉద్యోగాలొస్తాయేమో.. నాకు ఈ అర్హత లేదు, నన్ను ఎంపిక చేస్తారా!’ ఇలా సవాలక్ష ప్రశ్నలు వారి మెదళ్లను తొలిచేస్తుంటాయి. నిజానికి ఉద్యోగాలకు కేవలం మార్కులే ప్రాతిపదిక కాదంటున్నారు నిపుణులు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు హెచ్‌ఆర్ (HR) నిపుణులు సూచించే కొన్ని చిట్కాలివే..
ఆన్ క్యాంపస్ Vs ఆఫ్ క్యాంపస్.. ఏ ఇంటర్వ్యూ ఎలా?
- టెక్ ఆధారిత పోస్టులకు కోడింగ్ అవసరం. దానితోపాటు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. బృందంతో పనిచేయడం, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
- ప్రాంగణ ఎంపికల్లో సెలక్ట్ అవ్వాలంటే మంచి మార్కులు అవసరమే! కానీ కేవలం అధిక సీజీపీఏ మాత్రమే సరిపోదు. కంపెనీలు అన్నింటిలోనూ ముందుండే విద్యార్థుల పట్ల ఆసక్తి కనబరుస్తాయి.
- సమర్థమైన కమ్యూనికేషన్, ప్రాబ్లమ్‌సాల్వింగ్ నైపుణ్యాలు, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల వంటివి కచ్చితంగా ఇతరుల కంటే మన అవకాశాలను మెరుగుపరచగలవు.
రైల్వే జాబ్స్.. డిగ్రీతో 8,113 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
- కేవలం టైర్-1 కాలేజీల్లో చదివినంత మాత్రాన జాబ్ వస్తుందనీ కాదు.. అలాగే టైర్-2 కాలేజీల్లో చదివినంత మాత్రాన రాదనీ కాదు. టైర్-2, 3 కాలేజీల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు సొంతంగా కష్టపడి, స్కిల్ డెవలప్‌మెంట్, నెట్‌వర్కింగ్‌తో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కాలేజీ స్థాయి గురించి ఆలోచించకుండా బలమైన ప్రొఫైల్ సృష్టించుకునేందుకు ప్రయత్నించాలి.
- క్యాంపస్ ప్లేస్‌మెంట్లతోనే ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కూడా సరికాదు. ఆఫ్-క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్స్, ఫ్రీలాన్సింగ్ ద్వారా సైతం మెరుగైన అవకాశాలు పొందవచ్చు. అన్నింటికీ బలమైన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను పెంపొందించుకోవడం ముఖ్యం.
- మొదటి దశలో వైఫల్యాలు ఎదురైనంత మాత్రాన మన ప్రొఫైల్ బాగా లేదని కాదు. ప్రతి కంపెనీకి ప్రత్యేకఅవసరాలు ఉంటాయి. వైఫల్యాలకు వెరవకుండా పూర్తిస్థాయిలో ప్రయత్నించినప్పుడే స్థిరమైన విజయాలను అందుకోగలం.
- కేవలం అధిక జీతం మాత్రమే ఒక ఉద్యోగం బాగుందని చెప్పేందుకు ప్రాతిపదిక కాదు. ఉద్యోగం తీరు, కంపెనీ పద్ధతులు, నేర్చుకునేందుకు ఉన్న అవకాశాలు, పని - వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్, దీర్ఘకాలంలో కెరియర్ ఎదుగుదల వంటి అంశాల ఆధారంగా నిర్ణయించుకోవాలి.