BalPuraskar 2025 I ‘పీఎం రాష్ట్రీయ బాల్‌పురస్కార్’కు దరఖాస్తులు.. ఈ విశేషాలు తెలుసా?
ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించే బాలలకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2025 (Pradhan Mantri Rashtriya BalPuraskar) కోసం కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
By Education News Team
Published :30 Jun 2025 15:56 IST
https://results.eenadu.net/news.aspx?newsid=30062025-BalPuraskar-2025
ఇంటర్నెట్ డెస్క్: వివిధ కేటగిరీల్లో ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించే బాలలకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2025 (Pradhan Mantri Rashtriya BalPuraskar) కోసం కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు జులై 31వరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కోరుతోంది. అర్హులైన వారు https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. సాహసం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర-సాంకేతికం, పర్యావరణం, కళలు-సంస్కృతి వంటి ఆరు రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన బాలలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాల గురించి కొన్ని విశేషాలు మీ కోసం..
కొన్ని ముఖ్యాంశాలు..
- దరఖాస్తు చేసుకొనే బాలలు భారతీయ పౌరులై ఉండాలి. వారి వయస్సు ఐదేళ్లు పైబడి ఉండాలి. 18 ఏళ్లు మించరాదు (జులై 31 నాటికి). అలాగే, బాలలు సాధించిన విజయం/సాహసోపేత చర్యలు దరఖాస్తు చేసే సమయానికి రెండేళ్ల లోపు జరిగినవే అయ్యుండాలి.
- ఈ పురస్కారం కింద పతకంతో పాటు సర్టిఫికెట్, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఏటా గరిష్ఠంగా 25 పురస్కారాలు మాత్రమే అందజేస్తారు. ఈ నిబంధన సడలింపు పీఎంఆర్‌బీపీ కమిటీ చేతుల్లో ఉంటుంది.
- బాలలు తమ అసాధారణ విజయాలపై స్వీయ నామినేషన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. లేదంటే ఎవరైనా వ్యక్తి/సంస్థ కూడా వారిని ఈ పురస్కారాలకు నామినేట్ చేయొచ్చు.
- ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) కోసం అందిన నామినేషన్లను మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే కమిటీ ముందుకు వస్తాయి. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ కమిటీకి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు.
- పీఎంఆర్‌బీపీ కమిటీ సిఫార్సు చేసిన పేర్లను సదరు మంత్రి ఆమోదం ఉంటుంది.
- ఏటా డిసెంబర్ 26న వీర్‌బాల్ దివస్ సందర్భంగా ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. అనంతరం దిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో బాలలకు రాష్ట్రపతి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
- ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 9870108495కు కాల్ చేయొచ్చు. లేదా support.nca@gov.inకు మెయిల్ చేయొచ్చు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పని దినాల్లో సంప్రదించవచ్చు.