Problem solving | 60 నిమిషాల్లోనే సమస్యకు పరిష్కారం.. ఇలా ఆలోచిస్తే సులువే!

Problem solving | 60 నిమిషాల్లోనే సమస్యకు పరిష్కారం.. ఇలా ఆలోచిస్తే సులువే!

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థంకాక చాలామంది సతమతమవుతుంటారు.

Eenadu icon
By Education News Team Published :11 Jul 2025 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థంకాక చాలామంది సతమతమవుతుంటారు. అసలు సమస్య మూలాల్లోకి వెళ్లకుండా అనవసరంగా కంగారుపడే వారు కొందరైతే.. దాని చుట్టే తెగ ఆలోచిస్తూ చర్చోపచర్చలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొనేవారు ఇంకొందరు. దీంతో అటు సమయం వృథా.. ఇటు లేనిపోని మానసిక ఒత్తిడి. అందువల్ల ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ముందుగా ఆ సమస్యేంటీ? ఎంతవరకు మీ కంట్రోల్‌లో ఉంది? నిజంగా పరిష్కరించగలిగేదేనా? అనేది ఆలోచించడం ద్వారా కేవలం 60 నిమిషాల్లోనే పరిష్కరించొచ్చంటున్నారు నిపుణులు.

  • 0-10 నిమిషాలు: ముందుగా అసలు సమస్యేంటో నిర్ధారించుకోండి. చాలాసార్లు మనం సమస్యగా భావించేది.. అదసలు సమస్యే కాకపోవచ్చు. అందువల్ల మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. సమస్యేంటీ? చేయకపోతే తలెత్తే పరిణామాలు ఏంటో ప్రశ్నించుకుంటే మీకే అర్థమవుతుంది.  
  • 10-20 నిమిషాలు: సమస్యను భాగాలుగా విభజించి చూడండి. ఇందులో మీ నియంత్రణలో ఏముంది? మీకున్న పరిమితులేంటి? ఎక్కడెక్కడ చిక్కులు ఉన్నాయో తెలుసుకోండి. 
  • 20-35 నిమిషాలు: ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం మేధోమథనం చేయండి. సమస్య పరిష్కారానికి సాధ్యమయ్యే రీతిలో మీకు వచ్చే ప్రతి ఆలోచననూ రాసి పెట్టుకోండి. వెంటనే మీ ఆలోచనల్ని ఫిల్టర్‌ చేయొద్దు. ఆ తర్వాత వాటిని క్రమపద్ధతిలో చూడండి.
  • 35-50 నిమిషాలు: ఆ తర్వాత మీరు క్రమపద్ధతిలో ఉంచిన ఆలోచనలకు కొన్ని ప్రశ్నలు సంధించి ఫిల్టర్‌ చేయండి. అసలు దీన్ని నేను చేయొచ్చా? లేదా? ఎంత త్వరగా దీనిపై చర్యలు తీసుకోగలను? ఇది ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందా? అనేది ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.
  • 50-60 నిమిషాలు: ఇక యాక్షన్‌ మొదలు పెట్టేయండి. మీ సమస్య పరిష్కారానికి తొలి అడుగు ఆ రోజే వేయండి. ఇంకా వేచి చూడకుండా.. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకుండా పరిష్కారం దిశగా ముందుకెళ్లండి.