World Youth Skills Day | ఏఐ వరల్డ్‌ గురూ.. ఈ నైపుణ్యాలు ఇప్పుడు ఆప్షనల్‌ కాదు.. కంపల్సరీ!

World Youth Skills Day | ఏఐ వరల్డ్‌ గురూ.. ఈ నైపుణ్యాలు ఇప్పుడు ఆప్షనల్‌ కాదు.. కంపల్సరీ!

ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల జాబ్‌ మార్కెట్లో(Job Market) కొత్త ట్రెండ్స్‌తో వర్క్‌ కల్చర్‌ స్వరూపమే మారిపోతోంది.

Eenadu icon
By Education News Team Published :15 Jul 2025 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీ రంగం(IT Sector)లో విప్లవాత్మక మార్పుల వల్ల జాబ్‌ మార్కెట్లో(Job Market) కొత్త ట్రెండ్స్‌తో వర్క్‌ కల్చర్‌ స్వరూపమే మారిపోతోంది. అనేక ఉద్యోగాలు మాయమైపోతుంటే.. అంతకుమించి కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా కొత్త నైపుణ్యాలు నేర్చుకొనే వారికే విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలు నేటి జాబ్‌ మార్కెట్‌కు సరిపోవట్లేదు. కృత్రిమ మేధ (AI), డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతోన్న తరుణంలో పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్‌ అందిపుచ్చుకున్నవారికే రిక్రూటర్లు పెద్దపీట వేస్తున్నారు. డిగ్రీలు ఉన్నవారి కన్నా నైపుణ్యాలున్న వారికే రెడ్‌కార్పెట్‌ వేసి ఆహ్వానిస్తున్నారు. నేడు ప్రపంచ యూత్‌ స్కిల్స్‌ డే(Wrold youth Skills Day) సందర్భంగా ఉద్యోగ సాధనలో యువత అభివృద్ధి చేసుకోవాల్సిన కీలక నైపుణ్యాలేంటో చూద్దాం!

  • రంగం ఏదైనా సరే నిత్య విద్యార్థిగా ఉండకపోతే అందులో రాణించడం కష్టమే. వృత్తి జీవితంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకొనేలా సన్నద్ధతతో ఉండాలి. ఏఐ(AI), ఆటోమేషన్‌ వంటివి ఉద్యోగాల స్వరూపాన్నే మార్చేస్తుండటంతో పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందే స్వభావం, డిజిటల్‌ అక్షరాస్యత వంటి స్కిల్స్‌ ఇప్పుడు ఒక ఆప్షన్‌గా కాదు.. తప్పనిసరైపోయాయని గుర్తుంచుకోండి.  దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది.  యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్‌ వంటి పథకాలూ అమలు చేస్తోంది. నైపుణ్యాభివృద్ధిలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా అవతరించింది.  స్కిల్ ఇండియా మిషన్‌ ద్వారా దాదాపు 50 మిలియన్లకు పైగా యువతకు టెక్నాలజీ, సర్వీసులు, ఉత్పత్తి వంటి రంగాల్లో శిక్షణ కల్పించింది. 
  • కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్‌,  క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ వంటి నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ డిమాండ్‌ భారీగానే ఉంది. అందువల్ల  డిజిటల్‌  నైపుణ్యాలు, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ అనేది ఇప్పుడు కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు.. ఒక ప్రాథమిక అవసరమైంది.
  • నైపుణ్యాల్లో అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు ఇప్పటికే వృత్తి శిక్షణలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఆరోగ్యరంగం, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, రిటైల్‌, సైబర్‌ సెక్యూరిటీ.. ఇలా పలు రంగాల్లో యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కంపెనీలు ప్రయోగాత్మక చర్యలు చేపడుతున్నాయి. 
  • ఉద్యోగాలిచ్చేందుకు ఇప్పుడు కంపెనీల యజమానులు అభ్యర్థులు ఏం చదివారో కాదు.. ఏం చేయగలరనే అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్‌ వరల్డ్‌ ప్రాజెక్టులు, పోర్ట్‌ఫోలియో వర్క్‌, ఉద్యోగానికి సన్నద్ధంగా ఉండగలగడం వంటి సామర్థ్యాలు విద్యార్హతల కన్నా ఎక్కువ విలువైనవిగా చూస్తున్నారు. 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, పరిస్థితులకు తగ్గట్టుగా మలచుకోగలిగే స్వభావం, నాయకత్వం, టీమ్‌ వర్క్‌ వంటి నైపుణ్యాలు గతంలో ఉద్యోగికి అదనపు ఆకర్షణలుగా ఉండేవి. నేటి గ్లోబల్‌ మార్కెట్‌లో రాణించేందుకు ఇప్పుడు ఈ సామర్థ్యాలే కీలకం, తప్పనిసరివిగా రిక్రూటర్లు భావిస్తున్నారు. 
  • హరిత ఇంధన పరిరక్షణపై దృష్టిసారించే రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ టెక్‌, పర్యావరణ పరిరక్షణపై అవగాహన , వ్యర్థాల నిర్వహణలో శిక్షణ పొందిన యువ నిపుణులకు గ్లోబల్‌ మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. 
  • ఇంటర్న్‌షిప్‌లు, పని ఆధారిత అభ్యాసం వంటివి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మారాయి. ఈ మోడల్స్‌ కూడా తరగతి గదిలో విద్యార్థి నేర్చుకున్న పాఠాలకు, పరిశ్రమల అంచనాలకు మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి.  సంప్రదాయ పద్ధతిలో పుస్తకాలు, తరగతి గది లెర్నింగ్‌తో పాటు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ను కొనసాగించే హైబ్రిడ్‌ మోడల్‌ని అనుసరించే యువతకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 
  • ప్రస్తుతం మహిళలు స్టెమ్‌ రంగంలో దూసుకొస్తున్నారు. గ్లోబల్‌ స్కాలర్‌షిప్‌లు, కొన్ని లక్షిత కార్యక్రమాలు వారిని సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) సంబంధిత కెరీర్‌లో ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ చర్యలు దీర్ఘకాలికంగా ఉన్న స్త్రీ-పురుష అంతరాలను తగ్గించేందుకు దోహదపడుతుంది.