10th, Inter Exams Preparation | పది, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మార్కుల్ని పెంచే ‘3పీ’ వ్యూహం ఇదిగో!
తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ వచ్చేసింది. విద్యార్థులు ఇప్పట్నుంచే సరైన ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు 3పీ వ్యూహం బాగా పనికొస్తుందని సూచిస్తున్నారు.
By Education News Team
Published :19 Dec 2024 17:14 IST
https://results.eenadu.net/news.aspx?newsid=19122024
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు షెడ్యూళ్లు వచ్చేశాయి (10th, Inter Exams). ఏపీలో మార్చి 17 నుంచి 31వరకు పదో తరగతి; మార్చి 1 నుంచి 20వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి; మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల కెరీర్‌ని మలుపు తిప్పే ఈ కీలక పరీక్షలకు ఇప్పట్నుంచే పకడ్బందీ ప్రణాళికతో సన్నద్ధమైతేనే (Preparation)మంచి మార్కులు సాధించగలరు. ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉండటంతో సబ్జెక్టుల వారీగా సమయం కేటాయించుకొని చదివితే సత్తా చాటొచ్చంటున్నారు నిపుణులు.
- ఇంకా కొద్ది నెలల్లో జరగబోయే టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో మంచి మార్కుల కోసం 3 ‘పీ’ వ్యూహాన్ని అనుసరించండి. అదే ప్లానింగ్ (ప్రణాళిక), ప్రిపరేషన్ (సన్నద్ధత), ప్రెజెంటేషన్ (సమర్పణ). కచ్చితమైన ప్రణాళిక వేసుకొని చదవి పరీక్షల్లో చక్కని ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా టాపర్‌గా నిలిచేందుకు ఈ 3పీ వ్యూహం బాగా పనిచేస్తుంది.
- పాఠ్యాంశాల పునశ్చరణకు వీలుగా సొంతగా టైం టేబుల్ రూపొందించుకోండి. సమయం దగ్గరపడుతున్నకొద్దీ చదవాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందొద్దు. ఇంతకుముందు చదివినవే అయినా ప్రణాళిక ప్రకారం ఆయా పాఠ్యాంశాలను అవగాహనతో చదివి ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేయండి.
- పూర్తి స్థాయిలో అన్ని పాఠ్యాంశాల్నీ చదివినా సరే.. వాటిలోని కీలకాంశాలు, వ్యాకరణాంశాలు, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలపై దృష్టి పెట్టండి. పాఠాలను చదివిన తర్వాత ప్రశ్నలను ఊహించుకొని ‘ఫలానా ప్రశ్న వస్తే జవాబు రాయగలనా?’ అని కళ్లు మూసుకొని మననం చేసుకోవడం ఉత్తమం. ఎక్కడైనా బ్రేక్ పడితే దానిపై మరింత దృష్టి సారించి మరోసారి చదివి పట్టు సాధించే ప్రయత్నం చేయండి.
- పరీక్షల ప్రిపరేషన్‌లో ముఖ్యంగా కావాల్సింది టైం మేనేజ్‌మెంట్. టైమ్‌టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించాలి. మూడ్ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్లొద్దు.
- ప్రిపరేషన్ సమయంలో వ్యక్తిగత క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరం. ఒకేసారి అన్నీ చదివేయాలనే ఆత్రుత అస్సలు పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పాటుచేసుకోండి. వాటి సాధనకు నిరంతరం కృషిచేయాలి. చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా వాటిని తట్టుకుని ఏకాగ్రతతో చదవండి.
- ప్రాక్టీస్ ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయడానికి ప్రయత్నించాలి. ఇలాచేస్తే పరీక్ష విధానాన్ని అర్థంచేసుకోవడం సులువు. అవగాహన పెరగడంతో పరీక్ష ఎలా ఉంటుందోననే ఆందోళన కూడా తగ్గుతుంది. సమస్యా పరిష్కార నైపుణ్యమూ పెరుగుతుంది.
- ప్రశ్నపత్రం చేతికొచ్చాక ప్రజెంటేషన్ సరిగా లేకపోతే ఇన్నాళ్లూ మీరు పడిన కష్టం వృథా అవుతుంది. అందువల్ల ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చిన మార్కులు, జవాబు ఎలా? ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకోవడం అవసరం.
- సైడ్ హెడ్డింగ్‌లను పెన్నుతో అండర్‌లైన్ చేయండి. మార్జిన్లను పాటించండి. కోడ్ పదాలను రాయొద్దు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయండి. ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడికి మీ పేపర్ పట్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడటంతో పాటు మీరు రాసే జవాబుల్ని త్వరగా గుర్తించగలుగుతారు.
- జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య సరిగా వేశారా లేదా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఇచ్చిన సమయంలోనే అన్ని అంశాలూ రాయగలుగుతున్నారో లేదో చూసుకోండి. ఉదాహరణకు పరీక్ష సమయం రెండు గంటలైతే.. పాత ప్రశ్నపత్రాన్ని ఆ వ్యవధిలోనే పూర్తిచేసేలా ప్రాక్టీస్ చేయండి.
- ప్రిపరేషన్ సమయంలో కొంతమంది విద్యార్థులు విపరీతమైన ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. అలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. వీలైతే యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు. సరిగా నిద్ర ఉండేలా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చదివే సమయంలో మొబైల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలరు.