Good Sleep for Good Health | పరీక్షల సన్నద్ధతకు నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..!

Good Sleep for Good Health | పరీక్షల సన్నద్ధతకు నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..!

విద్యార్థులకు తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు చదివింది సరిగా గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

Published :10 Nov 2024 18:05 IST

Good Sleep for Good Health| ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్షలొచ్చాయంటే చాలు.. రాత్రిళ్లు సైతం మేలుకొని చదువుతుంటారు చాలా మంది విద్యార్థులు (Students). రాత్రింబవళ్లు కష్టపడి చదవడం తప్పేం కాదు.. కానీ, శరీరానికి ఎంతో ముఖ్య అవసరమైన నిద్ర (Sleeping)ను నిర్లక్ష్యం చేస్తే అసలుకే ముప్పు! పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు చదివింది సరిగా గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!

  • విద్యార్థులకు నిద్ర చాలా చాలా అవసరం. సరిపడా గాఢనిద్ర లేకపోతే  జ్ఞాపకశక్తి, అకడెమిక్‌ పెర్ఫామెన్స్‌పైనే కాదు.. మొత్తంగా వారి ఆరోగ్యంపైనే నేరుగా ప్రభావం ఉంటుంది. రోజూ తగినంతగా నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఫోకస్‌ పెరగడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. నేర్చుకొనే ప్రక్రియలో ఇది ఎంతో కీలకం. 
  • నాణ్యమైన నిద్ర లేకపోతే విద్యార్థుల్లో శ్రద్ధాశక్తులు తగ్గడంతో పాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యం తగ్గడం ద్వారా అకెడమిక్‌ పెర్ఫామెన్స్‌ దెబ్బతింటుంది.  ఇంటర్‌, ఆపైన చదివే విద్యార్థులు 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది.
  • భావోద్వేగాలను నియంత్రించుకొనేందుకు రాత్రి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 
  • జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంలో నిద్రదే కీలక పాత్ర . చదివే విషయాలను మెదడులో నిక్షిప్తం చేయడం, ప్రాసెస్‌ చేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి నిద్రపట్ల నిర్లక్ష్యం వహిస్తే.. మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే ముప్పు పెరుగుతుంది. మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ అస్థిరత వంటివీ కలగొచ్చు.
  • తగినంత నిద్ర లేకపోతే.. పగటిపూట మగతగా ఉండటం, చురుకుదనం కోల్పోవడం, ఏకాగ్రత కష్టతరం కావడం జరుగుతుంది. శరీరానికి నిద్ర రిలాక్సేషన్‌ ఇవ్వడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడే ముప్పు తగ్గుతుంది. 
  • నిద్రపోయేటప్పుడు మంచంపైన ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి ఉంచుకోవద్దు. నిద్రపోయేముందు వీడియోగేమ్స్‌ వంటివి వాడితే మెదడు ఉత్తేజితమై నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. 
  • నిద్రకు ఉపక్రమించే ముందు ఒత్తిడికి గురిచేసే క్రైం, సస్పెన్స్‌, యాక్షన్‌ సినిమాలు చూడటం కూడా అంత మంచిది కాదు. ఇది విద్యార్థులు కచ్చితంగా పాటించాల్సిన నియమం.
  • తక్కువగా నిద్రపోతున్న విద్యార్థులు తరగతిగదిలో శ్రద్ధ పెట్టలేకపోవడం, మార్కులు సాధించడంలో విఫలం కావడం, పాఠాలు గుర్తుండకపోవడం, మానసిక సమస్యల వంటివాటి బారిన పడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • కొందరైతే ‘రేపు సెలవే కదా!’ అని ముందురోజు పొద్దుపోయేదాకా మేల్కొని ఉండటం, మరుసటి రోజు పొద్దున్నే లేవకపోవడాన్ని అలవాటుగా మార్చుకుంటుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. సెలవులైనా, పరీక్షలైనా.. ప్రతిరోజు ఒకేటైంకి నిద్రపోవడం, మేల్కోవడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి ఆ పద్ధతి అలవాటై చురుగ్గా ఉంటారు.
  • పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించాలన్నా, పరీక్షల్లో నెగ్గాలన్నా, చదువులో పురోగతి సాధించాలన్నా సరిపడా నిద్ర తప్పనిసరి. ఏది మానుకున్నా సరే.. నిద్రకు మాత్రం టైం కేటాయించాల్సిందే.