Study Tips | పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!
అదేం విచిత్రమో గానీ.. కొందరికి ఇలా పుస్తకం ముందు కూర్చొని పేజీలు తిప్పగానే నిద్ర ముంచుకొస్తుంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించడం ఎలా? నిపుణులు సూచించే కొన్ని టిప్స్ మీకోసం!
Published :21 Oct 2024 06:01 IST
https://results.eenadu.net/news.aspx?newsid=201024
Study Tips| ఇంటర్నెట్ డెస్క్: అదేం విచిత్రమో గానీ.. కొందరికి ఇలా పుస్తకం ముందు కూర్చొని కొన్ని పేజీలు తిప్పగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. పరీక్షల సమయంలో ఇలాగైతే కష్టమే కదా! తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టులు చదవాలంటే అయ్యే పని కాదు. మరి, ఈ ఇబ్బందిని అధిగమించడం ఎలా? నిపుణులు సూచించే కొన్ని టిప్స్ మీకోసం!
టీనేజర్లలో ఈ నైపుణ్యాలుంటే.. తిరుగులేని కెరీర్!
- చదివేటప్పుడు కూర్చొనే విధానం కూడా ఎంతో ముఖ్యం. చాలా మంది టేబుల్‌పై పుస్తకాలు పెట్టుకుని.. కుర్చీలో కూర్చుని చదువుతుంటారు. నిజానికి ఇది చాలా అనువైన పద్ధతే. కానీ, కొందరు మాత్రం మంచం మీద కూర్చుని లేదా పడుకొని చదువుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుని.. త్వరగా నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది.
- కూర్చొని చదువుతున్నప్పుడు తరచూ నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. డీహైడ్రేట్ అయితే.. అలసట, తలనొప్పికి గురై చురుకుదనాన్ని కోల్పోతారు.
- కొందరైతే రాత్రి సమయంలో బెడ్ లైటు వెలుగులోనే చదువుతుంటారు. దీంతో వెలుతురు తక్కువై చురుగ్గా ఉండలేరు. తద్వారా మగతగా అనిపించి త్వరగా నిద్ర ముంచుకొచ్చే అవకాశాలు ఎక్కువ.
- అతిగా తిని చదవడానికి కూర్చోవడం వల్ల మగతగా ఉండి కళ్లు మూతలు పడతాయి. చదవడానికి ముందు.. అవసరమైన దానికంటే కాస్త తక్కువగా తినడమే ఉత్తమం. దీంతో మత్తు ఆవరించకుండా చురుగ్గా ఉండగలుగుతారు.
- పగటిపూట కళ్లు మూతలు పడుతున్నాయంటే అర్థం.. రాత్రి సరిగా నిద్రపోలేదనే కదా! రాత్రుళ్లు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. త్వరగా నిద్రపోయి వేకువజామునే లేవడం వల్ల కూడా ప్రయోజనాలు అనేకం. అప్పుడే మెదడు చురుగ్గా ఉండటమే కాదు.. ఆ సమయంలో చుట్టుపక్కల వాతావరణమూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.
- పరీక్ష సమయంలో వేకువజామున లేచి చదవడం అవసరమవుతుంది. అలాంటప్పుడు మధ్నాహ్నం పూట నిద్ర వస్తుంటుంది. అప్పుడు కాసేపు కునుకు తీస్తే ప్రయోజనం. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మీ పఠనాన్ని కొనసాగించవచ్చు.
- చదివేటప్పుడు కునుకు రాకుండా ప్రొటీన్ బార్లు, చాక్లెట్లు, నట్స్ వంటివి అందుబాటులో ఉంచుకోండి. వీటివల్ల శరీరం తొందరగా నిద్రావస్థలోకి జారుకోదు. వీటిని తినడం వల్ల శక్తీ లభిస్తుంది. మగతగా అనిపించినప్పుడు టీ, కాఫీ వంటివి తీసుకోవడం ద్వారా చురుకుదనం లభిస్తుంది.
- రాత్రుళ్లు ఆసక్తిగా, కాస్త తేలిగ్గా ఉండే సబ్జెక్టులను ఎంచుకుని చదవడం మంచిది. ఆసక్తిలేని వాటిని చదివితే విసుగు, ఆపై నిద్రా ముంచుకొస్తాయి. సాధారణంగా వేకువజామున మెదడు చురుగ్గా ఉంటుంది. అప్పుడే నిద్ర నుంచి లేవడం వల్ల శారీరకంగానూ ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల ఈ సమయంలో క్లిష్టంగా ఉండే సబ్జెక్టులను చదివితే సులువుగా అర్థమవుతుంది.
- ఒకే పొజిషన్‌లో కూర్చొని ఎక్కువసేపు చదవడం వల్ల బద్ధకంగా, మత్తుగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడూ నిద్ర ముంచుకొస్తుంది. కుర్చీలో నుంచి లేచి.. కాస్త అటూఇటూ తిరగడం, కాళ్లూచేతులను కదిలించడం లాంటివి చేయడం ద్వారా చలాకీగా ఉండగలుగుతారు.
- నిద్ర ముంచుకొస్తున్నప్పుడు అప్పటికే చదివినదాన్ని ఒకసారి చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఇలా రాయాలంటే.. అప్పటివరకూ చదివిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో బద్ధకం వదిలి మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. పైకి చదవడం మంచి చిట్కా. దీంతో మీ గొంతు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. నిద్ర మత్తు వదిలి చురుగ్గా చదవగలుగుతారు.