Life Skills For Teens | టీనేజర్లలో ఈ నైపుణ్యాలుంటే.. తిరుగులేని కెరీర్‌!

Life Skills For Teens | టీనేజర్లలో ఈ నైపుణ్యాలుంటే.. తిరుగులేని కెరీర్‌!

మారుతున్న కాలానికి అనుగుణంగా టీనేజర్లు కెరీర్‌లో రాణించేందుకు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు ఇవే..

Published :16 Oct 2024 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలం శరవేగంగా మారుతోంది. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే కేవలం చదువు, మార్కులకే పరిమితమైతే సరిపోదు. అంతకుమించిన నైపుణ్యాలుండాలి. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూనే.. కొన్ని లైఫ్‌ స్కిల్స్‌ను అలవర్చుకుంటేనే కెరీర్‌లో రాణించగలరు. అందువల్ల ఇప్పట్నుంచే టీనేజర్లు నేర్చుకోవాల్సిన కొన్ని నైపుణ్యాలేంటి? వాటిని మెరుగుపరుచుకొనేందుకు కొన్ని టిప్స్‌ ఇవిగో..

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (Communication Skills)

తోటివారితో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరైన భావవ్యక్తీకరణ ఓ ఫౌండేషన్‌లాంటిది! ఇది వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితానికీ ఎంతో అవసరం. కమ్యూనికేషన్ నైపుణ్యాలను అలవర్చుకోవడం ద్వారా యువత తమ ఆలోచనలను మరింత సరళంగా వ్యక్తపరచగలరు. శ్రద్ధగా వినడమే కాకుండా.. తమలోని ఆలోచనల్ని స్పష్టంగా అవతలి వ్యక్తికి చెప్పగలరు. తద్వారా తమ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. జీవితంలోని వివిధ రంగాల్లో విజయం సాధించేందుకు ఉపకరిస్తుంది.

మెరుగుపరుచుకొనేందుకు కొన్ని టిప్స్‌ ఇవిగో!

  • అవతలి వ్యక్తులు ఏం చెబుతున్నారో వినడం నేర్చుకోండి. ఈ ప్రక్రియతోనే కమ్యూనికేషన్‌ అనేది మొదలవుతుంది. శ్రద్ధగా వినడం, సంభాషణల్లో పాల్గొనడంతో పాటు వ్యక్తుల విలువైన అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా సంబంధాలు మరింత దృఢమవుతాయి.
  • మాట్లాడేటప్పుడు పారిభాషా పదాలు, సంక్లిష్టమైన భాషను వాడితే వినేవారికి గందరగోళంగా అనిపిస్తుంది. అందువల్ల సులభంగా అర్థమయ్యేలా స్పష్టమైన, సరళమైన పదాలను ఉపయోగించి మాట్లాడేలా ప్రోత్సహించండి.
  • మీరెలా మాట్లాడుతున్నారో ఇతరుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోండి. మీ భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎలా ఉందో తోటి స్నేహితులు, మీరు విశ్వసించే వ్యక్తుల అభిప్రాయాలు కోరడం ద్వారా ఇంకా ఎక్కడ మెరుగుపరుచుకోవాలో గుర్తించే అవకాశం ఉంటుంది. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించి మీ కమ్యూనికేషన్‌ శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోండి.

చదవడానికి ఏ టైం బెటర్‌.. ఉదయమా? రాత్రా?

టైం మేనేజ్‌మెంట్‌ (Time Management)

సమయం ఎంతో విలువైనది. దీన్ని అత్యంత సమర్థంగా నిర్వహించుకోగలిగే నైపుణ్యం మీ సొంతమైతే చేసే పనిలో ఉత్పాదకతను పెంచడంతో పాటు ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. టీనేజర్లు ఓవైపు తమ స్కూల్‌ వర్క్‌, మరోవైపు, ఇతర బాధ్యతలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ సమతుల్యత సాధించేందుకు వీలుంటుంది. అందువల్ల టైం మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ అలవర్చుకోవడం ద్వారా.. విద్యార్థులు తమ పనులను ప్రాధాన్యతల వారీగా పెట్టుకోగలరు. వాస్తవిక లక్ష్యాలు సెట్‌ చేసుకోవడంతో పాటు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

కొన్ని టిప్స్‌..

  • టీనేజర్లు అసలు తామేం సాధించాలనుకొంటున్నారో ముందు గుర్తించాలి. అందుకు తగ్గట్లుగా చిన్నవి, నిర్వహించదగినవిగా విభజించాలి. వాస్తవిక దృక్పథంతో తాము సెట్‌ చేసుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తే విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. 
  • మీ పనులను ప్రాధాన్యతల వారీగా నిర్ణయించుకోవడం ఎంతో కీలకం. ఏ పనులు అత్యంత ముఖ్యమైనవో తెలుసుకోగలిగితే.. అక్కడ ఎక్కువ సమయాన్ని, మీ శక్తిని కేంద్రీకరించేందుకు వీలుంటుంది.
  • చదువుతున్నప్పుడు లేదా మీ లక్ష్య సాధనలో ఉన్నప్పుడు ఇతర అవాంతరాలు లేకుండా చూసుకోండి. ఈ క్రమంలో మీ ఫోన్‌ ఆఫ్‌ చేయడం, కంప్యూటర్‌లో అనవసర ట్యాబ్‌లను క్లోజ్ చేయడం, వాతావరణాన్ని నిశ్శబ్దంగా ఉంచడం ద్వారా అంతరాలను నియంత్రించి పనిపై ఫోకస్‌ పెంచుకోవచ్చు.

డెసిషన్‌ మేకింగ్‌.. (Decision Making)

సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వృత్తిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎంతో కీలకం. నిర్ణయం సామర్థ్యం అవసరం రాని సందర్భాలు నేటి పరిస్థితుల్లో అరుదు. మనం తీసుకున్న నిర్ణయాలే వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేస్తాయి. నిర్ణయాలు తీసుకొనే ముందు విమర్శనాత్మక దృక్పథంతో ఆలోచించడం, లాభనష్టాలను బేరీజు వేసుకోవడం, జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకోవడం ఎంతో అవసరం.

కొన్ని టిప్స్‌..

  • మీ కెరీర్‌లో, వ్యక్తిగత లైఫ్‌లో సాధించాలనుకున్న లక్ష్యాలేంటనేది స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడంలో తొట్రుపాటు ఉండదు.
  • దేనిపై నిర్ణయం తీసుకొంటున్నారో సంబంధిత అంశంపై సంపూర్ణ సమాచారాన్ని సేకరించాలి. ఏ కాలేజీలో చేరాలి? ఏ కోర్సులో చేరాలి? లేదంటే ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలన్న మీమాంస ఏర్పడినప్పుడు వాటి పూర్వాపరాలపై సమాచారాన్ని వివిధ వనరుల నుంచి సేకరించి అవగాహనకు రావాలి. ఆన్‌లైన్‌లో వెతకడం, నిపుణులను సంప్రదిదించడం, మీరు నమ్మే స్నేహితులను, కుటుంబ సభ్యుల సలహాలు అగడం మేలు చేస్తుంది.
  • ఒకేఒక్క ఆప్షన్‌ ఉంటే నిర్ణయం తీసుకోవడంలో మీకు ఆత్మస్థైర్యం కొరవడుతుంది. అందువల్ల వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. ఒకటికి పదిసార్లు ఆలోచించి లాభనష్టాలను బేరీజు వేసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా హఠాత్తు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. ఉద్వేగంతో తీసుకునే నిర్ణయం అనుకున్న ఫలితాన్ని ఇవ్వదు. కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రశాంతమైన మనస్సు అవసరం. ఉద్వేగరహిత స్థితిలో తీసుకునే నిర్ణయాలే రాణిస్తాయి.

ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!

ప్రాబ్లమ్‌ సాల్వింగ్.. (Problem Solving)

జీవిత ప్రయాణంలో సవాళ్లు సహజమే. కానీ, ఎదురయ్యే సవాళ్లను తెలివిగా, సులభంగా పరిష్కరించడం నేటి తరం అభ్యసించాల్సిన ఒక కీలక నైపుణ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యలను విశ్లేషించడం, సృజనాత్మక పరిష్కారాలను ఆలోచించడం ద్వారా అడ్డంకులను అధిగమించే నేర్పు మిమ్మల్ని లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. 

కొన్ని టిప్స్‌..

  • సమర్థమైన కమ్యూనికేషన్‌లో వినడం మొదటిమెట్టు అయినట్లే.. సమస్య పరిష్కార నైపుణ్యానికీ అది అంతే కీలకం. ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య ఎలాంటిదో తెలియాలి. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించే ముందు సరిగ్గా సమస్య ఏంటో గుర్తించడం ప్రధానం. దీనికోసం ఆ ప్రాబ్లమ్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారితో మాట్లాడటం, పూర్తి వివరాలు - కారణాలు రీసెర్చ్‌ చేయడం, ఫీల్డ్‌లో నిపుణులను సంప్రదించడం వంటివి చేయాలి.
  • ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించడం.. ఒక్కొక్కొటీ పరిష్కరించుకుంటూ రావడం.. ఇలాంటి విభిన్నమైన ప్రక్రియలను ఇందుకోసం పాటించాలి.
  • సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి పరిష్కారాలు చేయవచ్చో ఒక జాబితా సిద్ధం చేయడం, ఏ పరిష్కారం ఎంతవరకూ ఫలితాలనిస్తుందో అంచనా వేయడం, అన్నింటికంటే సరైన దాన్ని ఎంచుకోవడం ఇందులో భాగం.