Study Time | చదవడానికి ఏ టైం బెటర్.. ఉదయమా? రాత్రా?
ఉదయాన్నే చదివితే మంచిదా? లేదంటే రాత్రిపూటా.. ఇది తేల్చుకోలేక సతమతమవుతున్నవారెందరో! ఇంతకీ, ఏ టైంలో చదివితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయో తెలిపే కొన్ని చిట్కాలివిగో..
Published :11 Oct 2024 16:32 IST
https://results.eenadu.net/news.aspx?newsid=11102024
Study Time | ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే చదవడం (Study) మంచిదా? లేదంటే రాత్రుళ్లా? పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం ఇదే! ఏ టైంలో చదివితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చో తేల్చుకోలేక సతమతమవుతున్నవారెందరో! ఇంతకీ, ఏ టైంలో చదివితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయో గుర్తించే కొన్ని చిట్కాలివిగో..
ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!
- ఏదైనా చదివే (Study) విషయంలో అందరికీ ఒకే సమయం నప్పదు. ఒక్కొక్కరి వ్యక్తిగత అంశాలు, ప్రాధాన్యతలు ఒక్కోలా ఉంటాయి. అందువల్ల చదివేందుకు ఉదయం మంచిదా? రాత్రుళ్లా అనేది ఆయా వ్యక్తుల అనుకూల సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పఠనానికి (Reading) ఫలానా సమయమే ఉత్తమమని ఏమీ చెప్పలేం. ఎప్పుడు క్రియేటివ్‌గా, ఏకాగ్రతగా ఉంటారో గుర్తించి ఎవరికి నప్పే సమయాన్ని బట్టి వారు తమ చదువును కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
- ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణాన్ని ఇష్టపడేవారికి పగటి పూటతో పోలిస్తే రాత్రి సమయం బెటర్. ఆ సమయంలో అంతరాయాలు కలిగే ఛాన్స్ తక్కువ. దీంతో ఏకధాటిగా సాఫీగా చదివే వీలుంటుంది. తద్వారా ఏకాగ్రత కుదురుతుంది. చదివే అంశం పట్ల లోతైన అవగాహన పొందటానికి వీలుంటుంది. చూపు మరల్చకుండా పాఠ్యాంశాల్లో నిమగ్నం కావొచ్చు.
- మనిషి ఎప్పుడు అప్రమత్తంగా, ఏకాగ్రతగా ఉంటాడో అని నిర్ణయించడంలో శరీర జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం చదివేవాళ్లు, రాత్రిపూట చదివేవాళ్లు కూడా చదువులో మంచి పనితీరు కనబరుస్తుంటారు. కాకపోతే, తమ అధ్యయన సమయాన్ని నిర్ధారించేందుకు సర్కేడియన్ రిథమ్ ఎప్పుడు అలర్ట్‌గా ఉంటుందో గుర్తించి దాన్నిబట్టి చదివే సమయాన్ని నిర్ణయించుకోవడం ప్రయోజనకరం.
- ఏ సమయంలో చదివితే మీకు ఉపయోగంగా ఉంటుందో గుర్తించే ప్రయత్నం చేయండి. రోజులో మీరు ఎప్పుడు ఎనర్జిటిక్‌గా, ఏకాగ్రతతో ఉంటారో ఆ సమయంలో చదువుపై శ్రద్ధ పెట్టండి. ఉదయాన్నే మీరు చురుగ్గా ఉంటారనుకుంటే.. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ రాత్రిపూట క్రియేటివ్‌గా, శ్రద్ధతో ఉంటే గనక మీ స్టడీ షెడ్యూల్‌ను దానికనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మేలు.
- ఉదయాన్నే సహజమైన పగటి కాంతిలో చదవడం ప్రయోజనకరం. ఇది మానసిక పరిస్థితిని, చురుకుదనాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. అందువల్ల ఉదయాన్నే చదవడం మీకు లాభమని భావిస్తే.. ఆ సమయాన్ని తీరిక చేసుకోండి.
- ప్లాన్ చేసుకొనే ముందు మీ రోజువారీ పనుల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకోండి. పగలంతా తరగతులు, కోచింగ్, ఇతర వ్యాపకాలు, పనులతో బిజీగా ఉంటే.. రాత్రి చదవడం కాస్త వీలుంటుంది. మీ షెడ్యూల్‌కు ఇబ్బంది లేకుండా ఈ టైంను వినియోగించుకోవచ్చు. విద్యార్థులు తమకు సవాల్‌గా అనిపించే అంశాలపై ఇలాంటి సమయాల్లో ఎక్కువ దృష్టిపెట్టొచ్చు.
- రోజుకు ఒక సమయం అని కాకుండా.. మీరు చదివే షెడ్యూల్‌ను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరం. ఉదయమైనా, రాత్రిళ్లయినా క్రమం తప్పకుండా షెడ్యూల్‌ను పాటిస్తే.. చదివే అంశాన్ని మెరుగ్గా అర్థం చేసుకునే వీలుంటుంది.
- మీరు ఏ సమయంలో చదివినా సరే.. నిద్రను మాత్రం త్యాగం చేయకండి. ఉదయం, రాత్రి స్టడీ సెషన్లు సమర్థంగా కొనసాగాలంటే.. మీరు ఎంత సేపు ఆరోగ్యకరమైన నిద్ర పోయారన్నదే కీలకం. తగినంత నిద్రపోవడం ద్వారా మీరు ఉత్సాహంగా ఉండటంతో పాటు అలర్ట్‌గా ఉంటారు.
- కొన్ని అంచనాల ప్రకారం.. రాత్రి సమయాల్లో తెలుసుకున్న విషయాలు ఎక్కువ సమయం గుర్తుండే వీలుంటుంది. అదే సమయంలో సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల.. అది మరింత ఎక్కువ కాలం గుర్తుండేలా మెదడు సిద్ధం అవుతుంది. అలాగే కష్టమైన సబ్జెక్టులను రాత్రి చదవడం.. ఆ సవాలును మరింత సమర్థంగా స్వీకరిస్తుంది.
- మీకు ఏది నప్పుతుందో గుర్తించేందుకు తొలుత ఉదయం, రాత్రి స్టడీ సెషన్లలో ప్రయోగాలు చేయండి. మీ పురోగతిని అంచనా వేయండి. మీ ఎనర్జీ లెవెల్, ఏ మేరకు సమాచారాన్ని గ్రహించగలుగుతున్నారో ట్రాక్ చేసుకోండి. తద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి మీ స్టడీ టైమ్‌ను నిర్ధారించుకోవడం ఉత్తమం.