Smart tips for Exams|పరీక్షల్లో ఉత్తమ స్కోరు.. ఈ స్మార్ట్‌ టిప్స్‌ పాటిస్తున్నారా?

Smart tips for Exams|పరీక్షల్లో ఉత్తమ స్కోరు.. ఈ స్మార్ట్‌ టిప్స్‌ పాటిస్తున్నారా?

పరీక్షలు ఏవైనా.. కొందరు విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. కానీ, రాసేటప్పుడు వారు చేసే చిన్న చిన్న పొరపాట్లే తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి.

Published :14 Nov 2024 06:08 IST

Exams Tips| ఇంటర్నెట్ డెస్క్‌: పరీక్షలకు విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. కానీ, రాసేటప్పుడు వారు చేసే చిన్న చిన్న పొరపాట్లే తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. తద్వారా పరీక్షల్లో మంచి స్కోరు చేయలేక నిరాశకు గురవుతుంటారు. అందువల్ల పరీక్షలు రాసేటప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో పరీక్షల్లో టాప్‌ స్కోరు చేయాలంటే పాటించాల్సిన కొన్ని స్మార్ట్‌ టిప్స్‌ మీకోసం.. 

పరీక్షల సన్నద్ధతకు నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..!

  • పరీక్ష హాలులో కూర్చోగానే విద్యార్థుల్లో టెన్షన్‌ ఉండటం సహజమే. కానీ, ప్రశ్నపత్రం చేతికి అందగానే చేయాల్సిన మొదటి పని.. అందులోని ప్రశ్నలను క్షుణ్నంగా చదవడం. దీనివల్ల ప్రశ్నలు స్పష్టంగా అర్థం చేసుకోవడంతో పాటు చిన్న చిన్న తప్పులు దూరం చేసుకొనేందుకు దోహదపడుతుంది. 
  • మీకు బాగా తెలిసిన ప్రశ్నలేవో గుర్తించి వాటికే తొలుత సమాధానాలను చకచకా రాసేయండి.  తద్వారా మీలో కాన్ఫిడెన్స్‌ స్థాయిలు పెరగడంతో పాటు కష్టమై కఠినమైన ప్రశ్నలను ఆలోచించి సమాధానాలు రాసేందుకు తగిన సమయం దొరుకుతుంది. అనవసర ఆందోళనా తగ్గుతుంది. 
  • పరీక్షల్లో ఏ ప్రశ్నకు ఎంత వరకు సమాధానం రాస్తే సరిపోతుందో చూసుకోండి.  ఎలా మొదలు పెట్టాలి? ఏ అంశంతో ముగించాలనే అంశంపై ఒక్క నిమిషం ఆలోచించి ఆ దిశగా సమాధానాలు రాస్తే మెరుగైన ఫలితం సాధించవచ్చు. రాసేది స్పష్టంగా ఉండేలా చూసుకోండి. 
  • మెరుగైన స్కోరు కోసం  చక్కని చేతిరాత, హెడ్డింగులు సరిగా పెట్టడం, బుల్లెట్‌ పాయింట్లు ఇవ్వండి.  కొన్ని సంక్లిష్టమైన అంశాలను వివరించేందుకు రేఖాచిత్రాలు, చార్ట్‌లను గీయడం ద్వారా ఆకర్షణీయంగా ఉంటుంది. తద్వారా పేపర్లు దిద్దేవారికి మీపట్ల మంచి ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది. 
  • ఒత్తిడిలో సైతం ప్రశాంతంగా ఉండగలగడం అలవర్చుకోండి. పరీక్ష రాసిన తర్వాత ఒక్కో సమాధానాన్ని రివ్యూ చేసుకోండి. తద్వారా మీరు రాసిన జవాబు కచ్చితంగా ఉందా? ప్రశ్నలకు తగినట్లుగానే సమాధానం రాశారా? ఇంకా ఏమైనా తప్పులుంటే చెక్‌ చేసి సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది.