Study in IITs: ‘అడ్వాన్స్‌డ్’ లేకుండా IITల్లో చదవొచ్చు.. ఎలాగో తెలుసా?
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు సాధించాలంటే లక్షలాది మందితో పోటీ పడి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటాలన్న విషయం తెలిసిందే. కానీ, ఈ పరీక్ష లేకుండానే.. గేట్, క్యాట్, జామ్‌లాంటి పరీక్షలు రాయడం, పలు ఐఐటీలు అందిస్తోన్న షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరడం ద్వారా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో విద్యనభ్యసించాలన్న కలను సాకారం చేసుకోవచ్చు.
Published :08 Dec 2024 18:29 IST
https://results.eenadu.net/news.aspx?newsid=081224
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు సాధించాలంటే లక్షలాది మందితో పోటీ పడి జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced)లో సత్తా చాటాలన్న విషయం తెలిసిందే. కానీ, ఈ పరీక్షతో సంబంధం లేకుండానే.. గేట్(GATE), క్యాట్(CAT), జామ్(JAM)లాంటి పరీక్షలు రాయడం, కొన్ని ఐఐటీలు అందిస్తోన్న షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరడం ద్వారా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో విద్యనభ్యసించాలన్న మీ కలను సాకారం చేసుకోవచ్చు. అదెలాగో తెలియాలంటే.. ఈ కథనం చదవండి.
దేశంలోని ఏదైనా ఐఐటీలో చేరాలన్నది సగటు విద్యార్థి జీవిత కల. ఆ లక్ష్యంతోనే ఏటా దాదాపు 13లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటుంటారు. కానీ, టాప్ 2.5లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే ఛాన్స్ రాగా.. వీరిలో కేవలం 17-18వేల మంది మాత్రమే తమ అసాధారణ ప్రతిభతో దేశంలోని 23 ఐఐటీల్లో సీట్లు సాధించగలుగుతారు. మిగతా అందరూ తమ కల నెరవేరక అసంతృప్తికి లోనవుతుంటారు. అయితే, ఐఐటీల్లో విద్యనభ్యసించాలన్న వారి కలను సాకారం చేసుకొనేందుకు ఉన్న కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివిగో!
ఒలింపియాడ్స్ (Olympiads)
అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో అసాధారణ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇటీవల ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ అవసరం లేకుండానే ఒలింపియాడ్ మెడలిస్ట్‌లకు ప్రవేశాలు కల్పిస్తామంది. బయోలాజికల్ సైన్స్, బయో ఇంజినీరింగ్ ,కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఎకానమిక్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి ఐదు విభాగాల్లో బీటెక్, బీఎస్ ప్రొగ్రామ్‌లలో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. డిపార్టుమెంట్‌ల పరిధిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ఒలింపియాడ్‌లో సాధించిన ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఐఐటీ బాంబే, ఐఐటీ గాంధీనగర్ గత కొంత కాలంగా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (UCEED)
ఐఐటీలు వివిధ డిజైన్ కోర్సులను సైతం అందిస్తుంటాయి. బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే UCEED ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా పలు ఐఐటీలు నిర్వహించే డిజైన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందొచ్చు. మీకు డిజైన్ రంగం పట్ల ఆసక్తి ఉంటే గనక ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో డిజైన్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే UCEED పరీక్ష రాసి మీ కలను నిజం చేసుకోవచ్చు.
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (CEED)
యూసీఈఈడీ (UCEED) మాదిరిగానే సీఈఈడీ (CEED) కూడా డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ఉమ్మడి పరీక్ష. ఐఐటీల్లో డిజైన్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఐఐటీల్లో డిజైన్ రంగంలో పీజీ చేయాలనుకొనేవారికి ఇదో అద్భుతమైన అవకాశం.
గేట్ (GATE)
ఏదైనా ఐఐటీ నుంచి బీటెక్ చేయాలన్న కోరిక నెరవేర్చుకోలేనివారు.. గేట్‌ను రాయడం ద్వారా ప్రఖ్యాత ఐఐటీల్లో పీజీ చేసే అవకాశాన్ని పొందొచ్చు. గేట్‌లో మంచి స్కోరు సాధించి ఐఐటీల్లో ఎంటెక్, ఎంటెక్ -పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకొనే సౌలభ్యం ఉంది. ఈ పరీక్షకు వయో పరిమితి ఏమీ లేదు. పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంజినీరింగ్ చదవాలనుకొనే వారికి ఇదో సువర్ణావకాశంలాంటిదని చెప్పొచ్చు.
క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)
మీరు ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఐఐటీల నుంచి మేనేజ్‌మెంట్ కోర్సులను అభ్యసించాలనుకుంటే క్యాట్ (CAT) రాయొచ్చు. ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా పలు ఐఐటీలు అందించే ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల్లో సీటు సాధించొచ్చు.
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM)
ఐఐటీలు కేవలం ఇంజినీరింగ్ చదువులే కాదు.. పలు సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను సైతం అందిస్తున్నాయి. సాధారణ బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఐఐటీల్లో ఎమ్మెస్సీ చేయాలనుకుంటే ‘జామ్’తో మీ కలను నిజం చేసుకోవచ్చు. ఈ పరీక్ష ప్రఖ్యాత ఐఐటీల్లోని వివిధ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తుంది.
- ఇవే కాకుండా.. పలు ఐఐటీలు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. డిగ్రీ ప్రోగ్రామ్‌లతో పాటు ప్రత్యేక అంశాలపై షార్ట్‌టెర్మ్ సర్టిఫికెట్ కోర్సులను సైతం అందిస్తుంటాయి. ఐఐటీలు ప్రత్యేకంగా అందిస్తోన్న క్లౌడ్ కంప్యూటింగ్, డెవోప్స్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకుంటూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకొని మెరుగైన కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.