IIT Madras | అన్నింటా మేటి.. ఐఐటీ మద్రాస్ గురించి తెలుసా?
ఇటీవల ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వరుసగా ఆరో ఏటా ఐఐటీ మద్రాస్(IIT Madras) అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో IIT Madras క్యాంపస్ ఎలా ఉంటుంది? ఏయే కోర్సులు ఉన్నాయి? ప్లేస్‌మెంట్స్‌కు ఉన్న అవకాశాలేంటి? ఇలా అనేక అంశాలను పరిశీలిస్తే..
Published :15 August 2024 17:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=15082024
ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ మద్రాస్..(IIT Madras) దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రసిద్ధి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద ఇటీవల రూపొందించిన జాబితాలో వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఇందులో చేరాలన్నది లక్షల మంది విద్యార్థులు కల. ఈ క్రమంలో వారికి ఐఐటీల గురించి ఎన్నో సందేహాలు ఉండటం సహజం. ఆన్‌లైన్‌లో లభించే రకరకాలైన సమాచారంతో గందరగోళానికి గురికాకుండా.. ఐఐటీ-మద్రాస్ పూర్వవిద్యార్థులు ఓ కొత్త ఆలోచనకు రూపునిచ్చారు. www.askiitm.com పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా IIT Madras గురించి మీకు ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు వీడియో రూపంలో తెలుగులోనే మీకు సమాచారం అందుబాటులో ఉంచారు.
ఆన్ క్యాంపస్ Vs ఆఫ్ క్యాంపస్.. ఏ ఇంటర్వ్యూ ఎలా?
Askiitm వెబ్‌సైట్‌లో తెలుగులో ఇచ్చిన 10 వీడియోల్లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఎలా ఉంటుంది? దాని ప్రత్యేకతలేంటి? ఏయే కోర్సులు ఉన్నాయి? బ్రాంచ్ ఎలా ఎంచుకోవచ్చు? ప్లేస్‌మెంట్స్, రీసెర్చ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు ఎలా ఉన్నాయి? సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలాంటి క్రీడా అవకాశాలు ఉన్నాయి? తదితర అనేక విషయాలను ఈ వీడియోలో పొందుపరిచారు. అంతేకాదు.. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా సరే, ఈ సంస్థకు సంబంధించిన ఏ విషయం గురించైనా ప్రశ్నలు అడగొచ్చు. వాటికి కొన్ని గంటల్లో జవాబులు ఇస్తారు. క్యాంపస్, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ, అకడమిక్స్... ఇలా దేని గురించైనా అభ్యర్థులు తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అభ్యర్థులకు కచ్చితమైన సమాచారం తెలియాలనే ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. జేఈఈ పరీక్షకు సన్నద్ధమయ్యే వారి కోసం సైతం అప్పుడప్పుడూ వర్చువల్ టూర్‌లు నిర్వహిస్తుంటారు. ఆసక్తికలిగిన వారు వాటిని ఉపయోగించుకొని తమ బంగారు భవితకు బాటలు వేసుకోవచ్చు.