English Learning Tips | ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడాలంటే..? వేసవిలో ఇంటి వద్దే నేర్చుకొనే టిప్స్ ఇవిగో!
వేసవి సెలవుల్లో ఇంటి వద్దే ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకొనేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్ మీ కోసం..
By Education News Team
Published :04 Apr 2025 16:34 IST
https://results.eenadu.net/news.aspx?newsid=english-learning-tips-04042025
Spoken English Skills | ఇంటర్నెట్ డెస్క్: ఐటీరంగం కొత్తపుంతలు తొక్కుతున్న వేళ ఇంగ్లిష్ మాట్లాడటం(Speak in English) ప్రతిఒక్కరికీ అనివార్యంగా మారింది. ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం రావాలంటే.. ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం తప్పనిసరైంది. కానీ, చాలా మంది ఉన్నత చదువులు అభ్యసించినా.. నలుగురిలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే జంకుతున్న పరిస్థితి. భాష పట్ల వారికి అవగాహన ఉన్నా.. మాట్లాడితే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనన్న భయమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వేసవి సెలవుల్లో మీ రోజువారీ కార్యకలాపాల్లో ఆంగ్ల భాషను భాగం చేసుకొని తగిన సాధన చేస్తే మీరూ చకచకా మాట్లాడేయగలరు. ఇంటి వద్దే మీరు సాధన చేసేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో!
టార్గెట్.. ప్రాక్టీస్..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది. అందువల్ల కొత్త అంశాలను నేర్చుకొనేందుకు ఈ సమయం ఎంతో విలువైనది. ఈ టైంలోనే మీ అభిరుచులతో పాటు ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకోవాలని సంకల్పించుకుంటే.. లక్ష్యసాధన సులువే. ఇందుకు తగిన రీతిలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ విశ్వాసాన్ని పెంచేందుకు, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేలా మిమ్మల్ని ప్రోత్సహించేందుకు ఇదే గొప్ప మార్గం.
ఆ అపోహల్ని వీడితేనే..
తప్పులు మాట్లాడేస్తామేమో.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న అపోహల్ని ముందు వీడండి. నేర్చుకొనే సమయంలో తప్పులు సహజమే. వాటినే గుర్తు చేసుకుంటూ కూర్చొంటే.. కొత్తవి ఎప్పటికీ నేర్చుకోలేరు. మీరు వీలైనంత మేర ఆంగ్లంలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితం సాధిస్తారు. ఈ దిశగా మీరు చేసే ప్రాక్టీసే.. మీ భాషా నైపుణ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వారితో స్నేహం.. లాభం!
ఆంగ్లం మాట్లాడటంలో మంచి ప్రవేశం ఉన్నవారితో స్నేహం మీకు మరింత మేలు చేస్తుంది. మీరు ఉండే పరిసరాల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారు లేదా నేర్చుకొనేవారు ఉంటే వారితో స్నేహం చేయండి. వారిని కలిసిన ప్రతిసారీ ఆంగ్లంలో మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే మీరు మరింత త్వరగా నేర్చుకోగలుగుతారు.
టెక్నాలజీ వినియోగం..
ఇంట్లో ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు టెక్నాలజీని వినియోగించడం అలవాటు చేసుకోండి. మీ మాటలను రికార్డు చేసుకోండి. ఆ తర్వాత వాటిని వినడం ద్వారా మీ మాటల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు దొర్లుతున్నాయో గుర్తించండి. అంతేకాదు.. ఏయే చోట్ల మీరు మెరుగుపడాల్సి ఉందో గుర్తించి తద్వారా తప్పుల్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తే లక్ష్యాన్ని ఛేదించగలరు.
పద సంపద పెంచుకోవడం
రోజూ కొత్త పదాలు నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోండి. తద్వారా మీ పద సంపద పెరుగుతుంది. నేర్చుకున్న కొత్త పదాలను వేర్వేరు వాక్యాల్లో ప్రయోగించడం ద్వారా ఆంగ్ల భాషపై మీకు పట్టు ఏర్పడుతుంది. మీ భాషలో సహజత్వం వచ్చే వరకూ సాధన చేయండి. అది మీకు సహజంగా అనిపించే వరకు సాధన చేయండి.
సినిమాలు, షోల వీక్షణ
ఇంగ్లిష్ సినిమాలు, షోలను వీక్షించండి. అందులోని పాత్రలు ఏయే పరిస్థితుల్లో ఎలా మాట్లాడుతున్నాయో, హావభావాలు పలికిస్తున్నాయో గమనించండి. అందులో నటీ నటుల మాటలను అనుకరించే ప్రయత్నంతో మీరూ త్వరగా నేర్చుకోగలుగుతారు. ఆంగ్ల పుస్తకాలు, వార్తా పత్రికలు చదివేటప్పుడు బయటకు చదవడం అలవాటు చేసుకోండి.
బుక్ క్లబ్‌ల్లో చేరడం..
మీ రోజువారీ కార్యకలాపాలను ఆంగ్లంలో కొనసాగేందుకు ప్రయత్నించండి. మొదట్లో ఇబ్బందిగానే అనిపించినా.. రానురాను మీకు అదో అలవాటుగా మారిపోతుంది. ఆంగ్లం నేర్చుకోవడమే లక్ష్యంగా మీరు బుక్ క్లబ్‌ల్లో చేరడం, ఆన్‌లైన్ కోర్సులు తీసుకోవడం వంటివి మేలు చేస్తాయి.
డిబేట్‌లు చేయడం..
మీకు ఇష్టమైన అంశాలపై మీ స్నేహితులతో డిబేట్ చేయండి. తద్వారా మీ ఆలోచనల్ని ఆంగ్లంలో స్పష్టంగా వ్యక్తపరిచే సామర్థ్యం మెరుగుపడుతుంది. పదాల ఉచ్ఛారణ, అర్థం తెలియకపోతే.. డిక్షనరీ వినియోగించండి. కానీ, ప్రతిసారీ దానిపైనే ఆధారపడితే మాత్రం మీరు త్వరగా నేర్చుకోలేరు.