LIC Scholarships: ఎల్‌ఐసీ ‘గోల్డెన్‌’ ఛాన్స్‌.. స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు షురూ

ఎల్‌ఐసీ ‘గోల్డెన్‌’ ఛాన్స్‌.. స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు షురూ

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత చదువులకు ఎల్‌ఐసీ గోల్డెన్ ఫౌండేషన్‌ భరోసా కల్పిస్తోంది. ఈ సువర్ణావకాశం దక్కించుకొనేందుకు దరఖాస్తులు చేసుకోండిలా.. .

Published :08 Dec 2024 15:58 IST

LIC Golden Jubilee Scholarships 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు భారత జీవిత బీమా సంస్థ (LIC) సువర్ణావకాశం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్‌ఐసీ సిల్వర్‌జూబ్లీ ఫౌండేషన్‌ (LIC GJF) భరోసా కల్పిస్తోంది. ఈ మేరకు అర్హులైన విద్యార్థుల నుంచి ‘ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌-2024’ https://licindia.in/ వెబ్‌సైట్‌ ద్వారా స్వీకరిస్తోంది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్‌ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. (Golden Jubilee Scholarship Scheme)

ఎవరు అర్హులు? 

2021-22, 2022-23, 2023 -24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి/ ఇంటర్‌/ డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిష్‌న‌కు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమానమైన సీజీపీఏ గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024 -25లో ఉన్నత విద్య అభ్యసించాలనుకొనే విద్యార్థినీ విద్యార్థులకు జనరల్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఏదైనా విభాగంలో డిప్లొమో చేయాలనుకుంటున్నా, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్‌ కోర్సులు చేయాలన్నా, ఐటీఐ చదవాలనుకున్నా ఈ నగదు భరోసా కల్పిస్తారు. కాకపోతే, అభ్యర్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.2,50,000 మించరాదు. వితంతువు/ఒంటరి మహిళలైతే ఆ కుటుంబ వార్షికాదాయం రూ.4లక్షల వరకు సడలింపు కల్పించారు. 

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులు 2021-23/2022-23/2023-24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 60శాతం మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా 10+2లో చేరాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. యూజీ కోర్సులకు మాత్రమే ఈ ఉపకార వేతనాలను అందిస్తారు. పీజీ కోర్సులకు ఇవ్వరు.

ఎంతమందికి ఇస్తారు?

దేశవ్యాప్తంగా మొత్తంగా 112 ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయాలు ఉండగా.. ఒక్కో ఆఫీస్‌లో 30 మందిని చొప్పున షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిలో 20 మంది (10 మంది బాలురు, 10 మంది బాలికలు)ని జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు;  అలాగే, అర్హులైన మిగతా పది మందిని స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌కు ఎంపిక చేస్తారు. 

ఎంత మొత్తం ఇస్తారు?

జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు మెడిసిన్‌ (ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/బీడీఎస్‌) చదువుతున్న వారికైతే అర్హతలకు లోబడి ఏటా రూ.40వేలు ఇస్తారు.  రెండు విడతలుగా (రూ.20,000 చొప్పున) విద్యార్థి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌/బీఆర్క్‌) విద్యార్థులైతే  ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో (రూ.15000చొప్పున) చెల్లిస్తారు. గ్రాడ్యుయేషన్‌, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు  ఏటా రూ.20వేలు చొప్పున ఇస్తారు.  ఈ మొత్తాన్ని రెండు విడతల్లో (రూ.10వేలు చొప్పున) బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

  • స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, వొకేషనల్‌/డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని రెండు విడతల్లో (రూ.7500 చొప్పున) చెల్లిస్తారు. 

కొన్ని నిబంధనలివే.. 

  • పీజీ కోర్సులు అభ్యసించేందుకు ఈ స్కాలర్‌షిప్‌ స్కిమ్‌ (Golden Jubilee Scholarship Scheme) వర్తించదు.
  • ఏవైనా ఇతర ట్రస్టులు/ సంస్థల నుంచి ఇప్పటికే స్కాలర్‌షిప్‌ పొందుతున్నవారైతే ఈ స్కాలర్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకోరు. కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
  • దూరవిద్యా కోర్సులు లేదా పార్ట్‌టైం తరగతుల్లో చేరే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు. అలాగే, సీఏ/సీఎస్‌/ఐసీడబ్ల్యూఏ లేదా స్వీయ విద్యా కోర్సులు చేసేవారూ అనర్హులే.
  • స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 50శాతం మార్కులు సాధిస్తేనే తర్వాతి ఏడాదికి రెన్యువల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
  • మెడిసిన్‌, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు నిర్దేశించిన మార్కులను పొందితేనే మరుసటి సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
  • కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఒకవేళ కుటుంబంలో గర్ల్‌ చైల్డ్‌ ఉంటే ఇద్దరికీ అనుమతిస్తారు.
  • ఈ స్కాలర్‌షిప్‌ మంజూరు చేసినప్పుడు ఎల్‌ఐసీ విధించిన ఏ ఒక్క నిబంధనను ఉల్లంఘించినా సరే స్కాలర్‌షిప్‌ రద్దు అవుతుంది.
  • తప్పుడు సమాచారం/నకిలీ సర్టిఫికెట్లతో ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు రుజువైతే అతడు/ఆమె స్కాలర్‌షిప్‌ను రద్దు చేయడంతో పాటు వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తారు.
  • దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి