Fake job alert | ఫేక్‌ జాబ్‌ అలర్ట్‌! నకిలీ ఉద్యోగ ఆఫర్లను గుర్తించడమెలా?

Fake job alert | ఫేక్‌ జాబ్‌ అలర్ట్‌! నకిలీ ఉద్యోగ ఆఫర్లను గుర్తించడమెలా?

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ (Work from Home), ఆన్‌లైన్‌ వర్క్‌ కల్చర్‌ రోజురోజుకీ పెరుగుతుండటంతో నకిలీ ఉద్యోగాల పేరిట మోసగాళ్లూ అదే తరహాలో రెచ్చిపోతున్నారు.

Published :31 Oct 2024 21:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ (Work from Home), ఆన్‌లైన్‌ వర్క్‌ (Online work) కల్చర్‌ రోజురోజుకీ పెరుగుతుండటంతో నకిలీ ఉద్యోగాలతో మోసగాళ్లూ అదే తరహాలో రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులు, అమాయకులను టార్గెట్‌ చేసుకొని వారికి ఉద్యోగం ఆశచూపి జేబులను గుల్ల చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలను సైతం సేకరించి నిలువునా దోచేస్తున్నారు. పాపం! ఈ నకిలీరాయుళ్ల అసలు రంగు తెలియక వారిని నమ్మేస్తున్న యువత.. చివరకు వారి ఉచ్చులో పడి బలైపోతున్న ఉదంతాలు అనేకం! ఈ నేపథ్యంలో ఫేక్‌ జాబ్‌ ఆఫర్లను గుర్తించడం ఎలా? వీటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

కంపెనీలే మీవైపు చూసేలా.. ఈ స్కిల్స్‌ నేర్చుకున్నారా?

  • ‘సార్‌.. ఫలానా కంపెనీలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ ఉంది.. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కొంత మొత్తం కడితే చాలు’.. ‘డేటా ఎంట్రీ ఉద్యోగం ఉందండీ.. కన్సల్టెన్సీకి కొంత డబ్బు చెల్లిస్తే జాబ్‌ మీదే’, ‘ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీ.. మీ బ్యాంకు ఖాతా వివరాలు కాస్త చెప్పండి’ అంటూ కాల్స్‌ వస్తుంటాయి కదా! అలాంటి వాటిని కచ్చితంగా సందేహించాల్సిందే. నకిలీ ఉద్యోగాల బెడద రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే ముప్పే ఎక్కువ.
  • ఏదైనా ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయకుండానే మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్‌ అవ్వొచ్చు. అలాంటి వారు చెప్పే మాటలను తేలిగ్గా నమ్మి మోసపోవద్దు. మీ ప్రమేయం లేకుండా ఉద్యోగం ఆఫర్‌ చేసినట్లు కాల్‌ చేస్తే అలాంటివారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే చట్టబద్ధంగా నడిచే ఏ కంపెనీలూ దరఖాస్తు చేయని ఎవరినీ తమకు తాముగా సంప్రదించబోవని తెలుసుకోండి. 
  • కొందరు ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా జాబ్‌ ఇస్తామని కాల్‌ చేస్తుంటారు. కంపెనీలు ఏవైనా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు, ఇంటర్వ్యూ అనేవి సర్వసాధారణం. అందువల్ల ఇంటర్వ్యూ కూడా లేకుండా మీకు జాబ్‌ ఆఫర్‌ చేస్తామంటే అనుమానించాల్సిందే. ఎవరికీ మీ ఆధార్‌, పాన్‌ నంబర్లు, అడ్రస్‌, మెయిల్‌ ఐడీ వంటివి ఇచ్చేటప్పుడు తొందరపడొద్దు. ఎటువంటి రుసుమూ చెల్లించొద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వండి.
  • జాబ్‌ ఆఫర్‌ చేస్తూ వచ్చే ఈ-మెయిల్‌ను సైతం ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోండి. అది ఏ అడ్రస్‌ నుంచి వచ్చిందో చూడండి. ప్రొఫెషనల్‌ కంపెనీలు ఏవైనా అఫిషియల్‌ డొమైన్‌ పేర్లను ఉపయోగిస్తుంటాయి. అంతేగానీ జీమెయిల్‌, యాహూ వంటి ఉచిత ఈ-మెయిల్‌ సర్వీసులను వినియోగించవు.
  • ఏ కంపెనీలో జాబ్‌ ఆఫర్‌ అని చెబుతున్నారో.. ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అందులో నిజంగా నియామకాలు జరుగుతున్నాయో, లేదో ధ్రువీకరించుకోండి.  థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌లలో లిస్ట్‌ చేసినవి అంతగా నమ్మదగినవి కాదు. అందువల్ల ఇలాంటి వాటిపట్ల అప్రమత్తతో ఉండటం చాలా అవసరం.
  • ఏదైనా ఒక జాబ్‌ కోసం డబ్బులు అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే. మోసగాళ్లు ఉద్యోగం కోసం లేదా ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ ఖర్చుల కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. సక్రమమైన పద్ధతుల్లో నడిచే కంపెనీలేవీ.. ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి డబ్బులు అడగవు. కొందరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాక్‌డోర్‌ అంటూ మోసం చేస్తుంటారు. ఇలాంటివి పట్టణాలు, పల్లెల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అవి కూడా నిజం కాదని గమనించండి.
  • సోషల్‌మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలను అంత ఈజీగా నమ్మేయొద్దు. మనకు తెలిసిన వారు షేర్‌ చేసినా సరే.. ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకున్నాకే ముందుకెళ్లాలి. ఒక్కోసారి వేలకు వేల ఉద్యోగాలంటూ ఆన్‌లైన్‌లో పోస్టులు, వీడియోలు కనబడుతుంటాయి. అలాంటివాటికి స్పందించే ముందు నిజంగా అంత భారీ రిక్రూట్‌మెంట్ జరిగితే.. ప్రధాన మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా ఉండవు కదా! అని ఆలోచించి నిర్ధారించుకొనే ప్రయత్నం చేయాలి. 
  • డేటా ఎంట్రీ - ఇదో పెద్ద మాయాజాలం. ముందు కొంత మొత్తాన్ని డిపాజిట్‌ కట్టమంటారు. తర్వాత వర్క్‌ పంపుతాం అని చెబుతారు. ఏదో పని ఇచ్చి, మనం చేశాక వంకలు పెట్టి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. ఆపైన ఇంకా ఏవేవో కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తారు. మన దేశంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలని చెప్పే వాటిలో అధికశాతం ఇటువంటి మోసపూరిత సంస్థలే.
  • మంచి పేరున్న పెద్దపెద్ద కంపెనీల బ్రాండ్‌ను వాడుకుంటూ ఆఫర్స్‌ ఇస్తుంటే నమ్మకూడదు. ఆ కంపెనీల నియామక ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, కాస్త కఠినంగానే ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేస్తే ఆ సంస్థలు అంత పేరు ప్రఖ్యాతులు సాధించగలవా? అవన్నీ నకిలీలేనని గుర్తించాలి.
  • విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరిట మాయమాటలు చెబుతున్నా... మోసపోకూడదు. వెంకీ, దుబాయ్‌శీను సినిమాలు చూసే ఉంటారుగా!
  • కొందరు మరో అడుగు ముందుకేసి ఆఫర్‌ లెటర్స్‌ కూడా పంపిస్తుంటారు. వాటిని బాగా చదవాలి. అందులో భాష ప్రొఫెషనల్‌గా లేకపోయినా, అక్షరదోషాలు, అన్వయలోపాలు ఉన్నా, వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు ఇచ్చినా, మెయిల్‌ ఐడీ సంస్థది కాకుండా వ్యక్తులు వాడే ఉచిత ఐడీల్లా అనిపించినా దాన్ని అనుమానించాల్సిందే.
  • కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం.. ఇది మరో రకమైన మోసం. మన నంబరు తెలుసుకుని కాల్‌ చేసి, మంచి ఉద్యోగమంటూ మాయమాటలు చెబుతారు. లక్షల ప్యాకేజీ అని అంకెలు చెప్పి మభ్యపెడతారు. కొంత ఖర్చవుతుందంటూ డబ్బులు ఖాతాలో వేయమంటారు. ఇలాంటి సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగం ఇచ్చే ఏ సంస్థ అయినా అభ్యర్థి నుంచి డబ్బు తీసుకోదు! ఒకవేళ ఆ కన్సల్టెన్సీ నిజమైనదే అయితే దానికి సదరు సంస్థ చెల్లించుకుంటుంది లేదా చేరాక ఇమ్మంటారు కానీ ముందే కాదు. ఎవరైనా ముందే డబ్బు అడుగుతున్నారూ అంటే అది మోసమేనని గుర్తించాలి.