Job Skills | కంపెనీలే మీవైపు చూసేలా.. ఈ స్కిల్స్ నేర్చుకున్నారా?
అసలే పోటీ ప్రపంచం.. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన పరిస్థితుల్లో కంపెనీలే మీ వైపు చూడాలంటే ఎలాంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలి?
Published :24 Oct 2024 06:06 IST
https://results.eenadu.net/news.aspx?newsid=23102024
Job Skills | ఇంటర్నెట్ డెస్క్: అసలే పోటీ ప్రపంచం.. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. అసలు కంపెనీలే మీ వైపు చూడాలంటే ఎలాంటి నైపుణ్యాలు (Skills) అలవర్చుకోవాలో తెలుసా? ఇంటర్వ్యూ చేసేవారిని ఇంప్రెస్ చేసి.. ఇతరుల కంటే మీరెందుకు ప్రత్యేకమో నిరూపించుకోవాలంటే ఏం చేయాలో సూచించే కొన్ని చిట్కాలివిగో..
కొత్త ఆలోచనల కోసం.. ‘కాంప్లిమెంటరీ మీల్స్ ’: సుందర్ పిచాయ్
- నిత్య నూతనంగా లేకపోతే అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కళాశాలలో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ స్కిల్స్ నేర్చుకొనే ప్రయత్నం చేస్తేనే మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోగలం. ఉద్యోగాన్వేషణలో మీకు అవెంతో ప్లస్ అవుతాయి. ఏ ఉద్యోగానికైనా కచ్చితంగా కావాల్సింది భావ వ్యక్తీకరణ నైపుణ్యం (Communication Skills). ఎదుటి వారికి మీరేం చెప్పాలనుకొంటున్నారో సమర్థంగా వ్యక్తపరిచేందుకు ఈ నైపుణ్యమే కీలకం.
- పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్స్ నేర్చుకుంటే దాదాపు ఉద్యోగం వచ్చేసినట్లే! ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం, టీమ్ సభ్యులతో (Team Work) కలిసి ఉత్సాహంగా పనిచేయగలగడం, సమస్యలకు పరిష్కారాలు చూపగలగడం (Problem solving skills), భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి సాఫ్ట్ స్కిల్స్ (Soft skills) ఎంతో కీలకం.
- కాలేజీలో దశలో ఉన్నప్పట్నుంచే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలేంటో నిశితంగా గమనిస్తుండాలి. ఏ కోర్సు నేర్చుకుంటే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చో నిరంతరం శోధిస్తుండాలి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను (Technical Skills) మెరుగుపరుచుకుంటే బయటకు వచ్చాక ఉద్యోగం గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.
- ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి హార్డ్ స్కిల్స్ తెలిసిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డిజిటల్ ఆప్టిట్యూడ్‌తో పాటు డిజిటల్ టూల్స్, సాంకేతికత వినియోగంలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అప్పుడే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశాలు మెరుగవుతాయి.
- కేవలం సబ్జెక్టుపై పట్టు ఉన్నంత మాత్రాన సరిపోదు. బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, ఛాలెంజ్‌లను స్వీకరించగలగడం, నాయకత్వ లక్షణాలు (Leadership Skills), కస్టమర్ సర్వీస్- మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్ (Time Management), ప్రపంచ మార్కెట్‌కు అవసరమయ్యే నైపుణ్యాలకనుగుణంగా అప్‌డేట్ అయితే.. ఏ కంపెనీలూ మిమ్మల్ని వదులుకోవు.
- మార్కెట్ అవసరానికి తగ్గట్టు కంపెనీలకు కావాల్సింది సవాళ్లను స్వీకరించి పనిచేసే నైపుణ్యం కలిగిన సిబ్బందే. ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులపై మేధోమథనం చేసి తగిన పరిష్కారాలు చూపేవారు, సమస్యా పరిష్కార ఆలోచనా దృక్పథం ఉన్న వారినే కంపెనీలు ఎంచుకొంటాయి.
- ఉన్న సమయాన్ని ఫలప్రదంగా మలచుకోగలగడం, టార్గెట్‌లకు అనుగుణంగా పనులను ప్రాధాన్యతల వారీగా నిర్ణయించుకొని పూర్తి చేయడం, సమయ పాలన (Time Management)కు ప్రియారిటీ ఇచ్చేలా ఉన్న మీ అలవాటును రెజ్యూమ్‌కు జత చేస్తే ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. కంపెనీల్లో ఉత్పాదకతను పెంచేందుకు, కచ్చితమైన ప్రణాళికతో పనిచేయగల సమర్థతనూ వ్యక్తపరచాలి.
- డిజిటల్ యుగంలో ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రతి పనికీ డిజిటల్ స్కిల్స్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కీలకంగా మారాయి. కంప్యూటర్‌పై లోతైన పరిజ్ఞానం అవసరమైన ఉద్యోగాలే మార్కెట్లో అధికంగా ఉన్నాయి. అందువల్ల మీరు నేర్చుకున్న కంప్యూటర్ నైపుణ్యాలను రెజ్యూమ్‌లో హైలైట్ చేయాలి. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్, స్ప్రెడ్‌షీట్‌లు, సోషల్ మీడియా, డేటా విజువలైజేషన్, ఈ-మెయిల్ కమ్యూనికేషన్‌లో మీకున్న స్కిల్స్‌ను ప్రస్తావించాలి.
- ఓపెన్ మైండ్(Open Mind)తో పని చేయడమూ మరో కీలక నైపుణ్యమే. ఏదైనా కంపెనీలో ఒక హోదాలో పనిచేస్తే.. కొత్త కంపెనీకి మారేటప్పుడు అదే పనిని అక్కడ విభిన్నంగా చేయాల్సి రావొచ్చు. అందువల్ల అక్కడి పరిస్థితికి అనుగుణంగా పని చేసేందుకు ఈ నైపుణ్యం అవసరం. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండటం ఉద్యోగులు/ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం.
- మీరు పనిచేసేచోట వర్క్ ఎథిక్స్ (Work Ethics) పాటించడం అద్భుతమైన నైపుణ్యం. అప్పగించిన పనిని చక్కబెట్టి, విశ్వాసంతో ఉండే ఉద్యోగులనే ఏ కంపెనీలైనా కోరుకుంటాయి. ఎథిక్స్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి పర్యవేక్షణ అవసరం లేకుండానే మీ పనిని మీరు ముగించేందుకు దోహదపడుతుంది. దీనికితోడు యాక్టివ్‌గా వినడం, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, గెలుపోటములను స్వీకరించే స్వభావం, సహనశీలత వంటి లక్షణాలు మిమ్మల్ని ఆకర్షణీయంగా, ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.