One Nation One Subscription I ‘వన్‌ నేషన్‌ -వన్‌ సబ్‌స్క్రిప్షన్‌’.. ఈ కొత్త పథకం విశేషాలు తెలుసా?

One Nation One Subscription I ‘వన్‌ నేషన్‌ -వన్‌ సబ్‌స్క్రిప్షన్‌’.. ఈ కొత్త పథకం విశేషాలు తెలుసా?

దేశంలోని విద్యార్థులకు పరిశోధనాత్మక వ్యాసాలు/ పత్రికలను మరింత సులభంగా అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న పథకం విశేషాలివే..

Published :27 Sep 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని విద్యార్థులకు పరిశోధనాత్మక వ్యాసాలు/ పత్రికలను మరింత సులభంగా అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో  ‘వన్‌ నేషన్‌ -వన్‌ సబ్‌స్క్రిప్షన్‌’ (One Nation - One Subscription) పథకానికి ఆమోద ముద్ర వేశారు. దేశంలో నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు గొప్ప అవకాశం కల్పించడమే లక్ష్యంగా చేపట్టే ఈ కేంద్ర పథకం గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఫేక్‌ జాబ్‌ అలర్ట్‌! నకిలీ ఉద్యోగ ఆఫర్లను గుర్తించడమెలా?

  • వన్‌ నేషన్‌ -వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ (ONOS) పథకంతో దేశ వ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులకు ఉత్తమ నాణ్యతతో కూడిన పరిశోధనాత్మక వ్యాసాలు/పత్రికలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తాయి. 
  • దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన  6300 ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనాభివృద్ధి సంస్థల్లో దాదాపు 1.8 కోట్ల మందికి పైగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • ఈ నూతన పథకాన్ని మూడు దశల్లో ప్లాన్‌ చేస్తున్నారు.  తొలి దశలో కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పరిశోధనాభివృద్ధి సంస్థలకు; రెండో దశలో మిగతా ఉన్నత విద్యా సంస్థలకు; మూడో దశలో దేశ వ్యాప్తంగా ఈ జర్నల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. 
  • ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఏకీకృత పోర్టల్ One Nation One Subscription ద్వారా ఆయా ప్రతిష్ఠాత్మక సంస్థల పత్రికలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. 
  • సులువుగా పరిశోధనాత్మక వ్యాసాలు/పత్రికలను యాక్సిస్‌ చేసుకొనేలా యూజర్‌ ఫ్రెండ్లీ డిజిటల్ వేదిక కోసం 2025, 2026, 2027 సంవత్సరాలకు గాను కేంద్రం మొత్తంగా రూ. 6,000 కోట్లు కేటాయించనుంది.
  • వచ్చే ఏడాది జనవరి 1నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త పథకం దేశ విద్యారంగంలో  విప్లవాత్మక మార్పులకు తీసుకువచ్చే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 
  • దీనివల్ల పరిశోధనాత్మక వ్యాసాలు/జర్నల్స్‌ కోసం వివిధ వేదికల్లో చందాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే సభ్యత్వంతో 30 అంతర్జాతీయ పబ్లిషర్లు ప్రచురించిన వేలాది జర్నల్స్‌ను యాక్సిస్‌ చేసుకోవచ్చు. 
  • యూజీసీ ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ నెట్‌వర్క్‌ (INFLIBNET) ఈ పోర్టల్‌ను సమన్వయం చేయనుంది.