Exam Results | సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పదో తరగతి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు రాసిన లక్షలాది మంది సీబీఎస్‌ఈ(CBSE), ఐసీఎస్‌ఈ(ICSE) టెన్త్ విద్యార్థులు, ఇంటర్ బోర్డు విద్యార్థులు తమ ఫలితాలు ఎప్పుడొస్తాయనే అప్‌డేట్స్ కోసం వేచిచూస్తున్న తరుణమిది. ప్రస్తుతం ఆయా పరీక్షల సమాధానపత్రాల మూల్యాంకనం కొనసాగుతోన్న వేళ ఏయే పరీక్ష ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో గత ట్రెండ్స్‌ని బట్టి పరిశీలిస్తే..
By Education News Team
Published :02 Apr 2025 15:47 IST
https://results.eenadu.net/news.aspx?newsid=02042025-cbse-icse-results
Exam Results | ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు రాసిన లక్షలాది మంది సీబీఎస్‌ఈ(CBSE), ఐసీఎస్‌ఈ(ICSE) పదో తరగతి విద్యార్థులు, ఇంటర్ బోర్డు విద్యార్థులు తమ ఫలితాలు ఎప్పుడొస్తాయనే అప్‌డేట్స్ కోసం వేచిచూస్తున్న తరుణమిది. ప్రస్తుతం ఆయా పరీక్షలకు సంబంధించిన సమాధానపత్రాల మూల్యాంకనం కొనసాగుతోన్న వేళ ఏయే పరీక్ష ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో గత ట్రెండ్స్‌ని బట్టి పరిశీలిస్తే..
- ఫిబ్రవరి 15న ప్రారంభమైన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు(CBSE 10th exams) మార్చి 18తోనే ముగియగా.. 12వ తరగతి పరీక్షలు మాత్రం ఏప్రిల్ 4తో పూర్తికానున్నాయి. ఫలితాల విడుదల తేదీని సీబీఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ.. గతంలో ఆ బోర్డు విడుదల చేసిన ఫలితాల సరళిని గమనిస్తే మే నెల నాటికి సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కొత్త స్కిల్స్, కెరీర్ అవకాశాలు పెంచుకొనేలా.. విద్యార్థులు, ఉద్యోగులకు 100+ కోర్సులివిగో!
గతంలో ఫలితాల సరళి ఇలా..
2024లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలను మే 13న విడుదల చేయగా.. 2023లో మే 12న ప్రకటించారు. అలాగే, 2022లో జులై 22, 2021లో ఆగస్టు 3, 2020లో జులై 15న ఫలితాలను విడుదల చేశారు. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక.. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇలా అన్ని పరీక్షలూ పూర్తయ్యాక ఎవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ భరద్వాజ్ గతంలోనే వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు
cbse.gov.in
అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ స్కోరు కార్డులను పొందొచ్చు.
ఐసీఎస్‌ఈ ఫలితాలు..
ఐసీఎస్‌ఈ 10, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల ఫలితాలు సైతం మే నెల నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనున్నాయి. గతేడాది ఈ ఫలితాలు మే 6న విడుదల కాగా.. 2023లో మే 14న ఫలితాలను విడుదల చేశారు. దీన్ని బట్టి ఈసారి కూడా మే రెండో వారం నాటికి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను
www.cisce.org
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏప్రిల్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు!
మరోవైపు, ఏపీ ఇంటర్ ఫలితాలను(AP Inter Results) ఏప్రిల్ 12-15 తేదీల మధ్య విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 6 నాటికి మూల్యంకనం పూర్తి చేసి కంప్యూటరీకరణ పనుల అనంతరం వాట్సప్ ద్వారా ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల చేసిన తరహాలోనే.. ఈ పరీక్షల ఫలితాలను సైతం నేరుగా వాట్సప్‌లోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే..?
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు(TG Inter Results) సైతం ఏప్రిల్ నెలాఖరు నాటికి విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 5న ప్రారంభమైన ఈ పరీక్షలు 25తో ముగియగా.. ప్రస్తుతం సబ్జెక్టుల మూల్యాంకన ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతేడాది మార్చి 19నాటికి తెలంగాణ ఇంటర్ పరీక్షలు పూర్తవ్వగా.. ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. 2023లో మే 9న, 2022లో జూన్ 28న ఫలితాలు ప్రకటించారు.