IIT - Madras | కొత్త స్కిల్స్‌, కెరీర్‌ అవకాశాలు పెంచుకొనేలా.. విద్యార్థులు, ఉద్యోగులకు 100+ కోర్సులివిగో!

IIT - Madras | కొత్త స్కిల్స్‌, కెరీర్‌ అవకాశాలు పెంచుకొనేలా.. విద్యార్థులు, ఉద్యోగులకు 100+ కోర్సులివిగో!

జాబ్‌ మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా యువతలో కొత్త నైపుణ్యాలు, కెరీర్‌ అవకాశాలను పెంచేందుకు ఐఐటీ మద్రాస్‌.. ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేసేందుకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది.

Eenadu icon
By Education News Team Published :07 Mar 2025 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే ఇది డిజిటల్‌ ప్రపంచం. టెక్నాలజీలో రోజురోజుకీ వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఉద్యోగాల స్వరూపమే మారిపోతోంది. తీవ్రమైన పోటీతో కూడిన నేటి జాబ్‌ మార్కెట్లో తట్టుకొని నిలబడడం సవాలే. మార్కెట్‌కు అవసరమైన కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోకపోతే రాణించడమూ కష్టమే. ఈ పరిస్థితుల్ని గమనించిన ఐఐటీ మద్రాస్‌.. విద్యార్థులు, ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రతిష్ఠాత్మక కంపెనీలతో కలిసి నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కొత్త ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. 

జాబ్‌ మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా యువతలో కొత్త నైపుణ్యాలు, కెరీర్‌ అవకాశాల కోసం ప్రఖ్యాత ఐఐటీ- మద్రాస్‌ (IIT-Madras) ఎప్పటికప్పుడు కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఎల్‌ అండ్‌ టీ ఎడ్యుటెక్‌ (L&T Edutech)తో కలిసి ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేసేందుకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల్ని సృష్టించడం, మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లుగా వారిని తీర్చిదిద్దేందుకు 100కి పైగా కోర్సుల్ని అందిస్తోంది. దీనికవసరమైన కరికులమ్‌ను ప్రఖ్యాత ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి చెందిన నిపుణులు ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా అందించే ఈ కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ సర్టిఫికేషన్‌, ఎగ్జిక్యూటివ్‌ సర్టిఫికేషన్‌ ఆప్షన్లు ఉన్నాయి.

  • ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డిజిటలైజేషన్‌, రోబోటిక్స్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, నెక్ట్స్‌ జెన్‌ ఎనర్జీ స్టోరేజ్‌, హైడ్రోజన్‌ టెక్నాలజీ, ఇండస్ట్రీ 4.0 వంటి రంగాలను కవర్‌ చేయనున్నారు. అందించే కోర్సులు, కోర్సు వ్యవధి, ఫీజు, ఎన్‌రోల్‌మెంట్‌ వంటి వివరాల్ని ఈ వెబ్‌సైట్‌(https://lntedutech.com/iitmpravartak-joint-certification-programs/index.html) ద్వారా తెలుసుకోవచ్చు.
  • పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యాలను అందించి మానవనరుల్ని సిద్ధం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఐఐటీ మద్రాస్‌, ఎల్‌అండ్‌టీ ఎడ్యుటెక్‌ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఈ ఆన్‌లైన్‌ కోర్సులను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకొనే సౌలభ్యం ఉంది.

ట్రెండింగ్‌ ప్రోగ్రామ్స్‌ ఇవిగో..

  • మ్యానుఫాక్చరింగ్‌ విభాగంలో రోబొటిక్స్‌, డిజిటలైజేషన్‌
  • ఇండస్ట్రీ 4.0లో పీఎల్‌ఎం, వాల్యూ చైన్‌, స్మార్ట్‌ ఫ్యాక్టరీ
  • ఎడ్జ్‌ ఏఐ, ఇంజినీరింగ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ సస్టైనబిలిటీ, నెక్స్ట్‌ జెన్‌ ఎనర్జీ స్టోరేజ్‌ - బ్యాటరీ, హైడ్రోజెన్‌ టెక్నాలజీ, సీపీఎస్‌ అప్లికేషన్స్ ఫర్‌ మెకట్రానిక్స్‌, హెల్త్‌కేర్‌, ఈవీ, రోబోటిక్స్‌