NTA Alert | సోషల్ మీడియాలో అలాంటి క్లెయిమ్స్‌తో జాగ్రత్త: ఎన్‌టీఏ
టెలిగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ‘‘పేపర్ లీక్’’ పేరిట విద్యార్థుల్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతుండటంపై ఎన్‌టీఏ(NTA) ఆందోళన వ్యక్తంచేసింది.
By Education News Team
Updated :21 Jan 2026 19:07 IST
https://results.eenadu.net/news.aspx?newsid=beware-of-fake-claims-on-social-media-says-nta
ఇంటర్నెట్ డెస్క్: టెలిగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ‘‘పేపర్ లీక్’’ పేరిట విద్యార్థుల్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతుండటంపై ఎన్‌టీఏ(NTA) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని తాము గుర్తించినట్లు తెలిపింది. ప్రశ్నపత్రాలను ఇస్తామంటూ మోసపూరితంగా కొందరు చేస్తున్న క్లెయిమ్‌లను విద్యార్థులెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఏ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలనైనా టెలిగ్రామ్, వాట్సప్ లేదా మరే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇవ్వడం గానీ, విక్రయించడం గానీ, షేర్ చేయడం వంటివి జరగవని స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి మోసపూరిత క్లెయిమ్‌లను నమ్మి ఎవరూ డబ్బులు పోగొట్టుకోవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది.
ఇవన్నీ విద్యార్థుల్ని మోసగించి డబ్బులు కొల్లగొట్టే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలేనని అప్రమత్తం చేసింది. ఈ తరహా ప్రకటనలు తరచూ డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలను అడుగుతుంటాయని తెలిపింది. అందువల్ల ఇలాంటివి నమ్మడం వల్ల ఆర్థిక నష్టమే కాకుండా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థులు అధికారిక, కచ్చితమైన సమాచారం కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://nta.ac.in/ను మాత్రమే సంప్రదించాలని కోరింది.