JEE Main 2026 | జేఈఈ మెయిన్: షిఫ్ట్ -1 పరీక్ష పేపర్ రివ్యూ!
దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు (జనవరి 21) మొదటి షిఫ్ట్ పరీక్ష విజయవంతంగా ముగియగా.. రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైంది.
By Education News Team
Updated :21 Jan 2026 15:52 IST
https://results.eenadu.net/news.aspx?newsid=JEE-Main-2026-Session-1-exam-paper-Review
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు (జనవరి 21) మొదటి షిఫ్ట్ పరీక్ష విజయవంతంగా ముగియగా.. రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైంది. జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 14.10లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Shift 1 Paper Analysis | మొదటి షిఫ్టు పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈ ప్రశ్నపత్రం ఎలా ఉందనే అంశాన్ని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఫిజిక్స్‌వాలా సమీక్షించింది. ఆ సంస్థ విశ్లేషణ ప్రకారం.. మ్యాథమెటిక్స్ పేపర్ విద్యార్థులకు అత్యంత ఎక్కువ సమయం తీసుకునే విభాగంగా ఉంది. ఆల్‌జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొంది. ఈ రెండింటికీ సుదీర్ఘమైన కాలిక్యులేషన్, సమర్థమంతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు అవసరం కావడంతో అధిక సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిజిక్స్ విభాగం విషయానికి వస్తే.. ఎక్కువగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలనే అడిగారు. తొలి రోజు మొదటి షిఫ్టులో ప్రశ్నపత్రం ప్యాటర్న్ ఫండమెంటల్ కాన్సెప్టులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలో కెమిస్ట్రీని అత్యధిక స్కోరు చేయగలిగే విభాగంగా పరిగణిస్తుంటారు. అయితే, షిఫ్ట్ 1 పరీక్షలో ముఖ్యమైన ప్రశ్నలు నేరుగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని కాన్సెప్టులు, కంటెంట్ ఆధారంగానే వచ్చాయి. ఈ పేపర్ సాధారణ ట్రెండ్ మాదిరిగానే భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్ కెమిస్ట్రీ) నుంచి న్యుమెరికల్ ప్రాబ్లమ్స్‌తో పాటు అకర్బన, కర్బన రసాయన శాస్త్రం (Inorganice and Organic Chemistry) నుంచి సూటిగా థియరీ ఆధారిత ప్రశ్నలే అడిగినట్లు పేర్కొంది. మొత్తమ్మీద చూసినప్పుడు ఈ పేపర్ సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి సెషన్‌లో మూడు పేపర్లతో పోలిస్తే కెమిస్ట్రీ కాస్త మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని చెబుతున్నారు.