Mistakes in Exams| చిన్న పొరపాట్లే అనుకోవద్దు.. అవే మీ స్కోరుని దెబ్బతీస్తాయ్ జాగ్రత్త!
పరీక్షల కోసం విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. కానీ, పరీక్షలు (Exams) రాసేటప్పుడు వారు చేసే చిన్న పొరపాట్లే తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి.
By Education News Team
Published :19 Jan 2026 15:48 IST
https://results.eenadu.net/news.aspx?newsid=these-mistakes-that-reduce-your-exam-marks
ఇంటర్నెట్ డెస్క్: పరీక్షల కోసం విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. కానీ, పరీక్షలు (Exams) రాసేటప్పుడు వారు చేసే చిన్న పొరపాట్లే తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. తద్వారా పరీక్షల్లో మంచి స్కోరు చేయలేక విద్యార్థులు నిరాశకు గురవుతుంటారు. అందువల్ల పరీక్షలు రాసే సమయంలోనే కొన్ని మెళకువలు పాటిస్తే మంచి స్కోరు సాధించొచ్చంటున్నారు నిపుణులు. జేఈఈ మెయిన్, గేట్, నీట్ వంటి పోటీ పరీక్షలతో పాటు వార్షిక పరీక్షల్లోనూ మంచి స్కోరు రావాలంటే ఇలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రశ్నలు సరిగా చదవకపోవడం
పరీక్ష హాలులో కూర్చోగానే విద్యార్థుల్లో టెన్షన్ ఉండటం సహజమే. ఈ హడావుడిలో కొందరు ప్రశ్నను సరిగా అర్థం చేసుకోకుండా, కీవర్డ్స్ పట్టించుకోకుండా తప్పు సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రశ్నపత్రం మీ చేతికి అందగానే చేయాల్సిన మొదటి పని... ప్రశ్నలను క్షుణ్నంగా చదవడం. ఈ అలవాటు ద్వారా తప్పులు దొర్లకుండా ఉంటాయి.
అస్తవ్యస్తమైన చేతిరాత
కొందరి చేతిరాత సరిగా లేకపోవడంతో దిద్దేవారికి జవాబు పత్రాలు అర్థం కావు. మెరుగైన స్కోరు కోసం చక్కని చేతిరాత, సరిగా హెడ్డింగులు పెట్టడం, బుల్లెట్ పాయింట్లు ఇవ్వడం వంటివి అలవాటు చేసుకోండి. కొన్ని సంక్లిష్టమైన అంశాలను వివరించేందుకు రేఖా చిత్రాలు, చార్ట్‌లను గీస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. తద్వారా పేపర్లు దిద్దేవారికి మీరు రాసింది సులువుగా అర్థమవుతుంది. మీ పట్ల వారికి మంచి ఇంప్రెషన్ కూడా ఏర్పడుతుంది.
టైం మేనేజ్‌మెంట్ లేకపోవడం
పరీక్ష హాలులో సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం ఒక నైపుణ్యం. కొందరైతే ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించి.. మిగతా ప్రశ్నలను టైం లేక వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల ముందుగా మీకు బాగా తెలిసిన ప్రశ్నలేవో గుర్తించి వాటికి చకచకా సమాధానాలు రాసేయండి. తద్వారా మీలో కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు కఠినమైన ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలు రాసేందుకు తగిన సమయమూ దొరుకుతుంది. మీకు అనవసర ఆందోళనా తప్పుతుంది.
అవసరానికి మించి రాయడం
చాలామంది ప్రశ్నపత్రంలో ఇచ్చిన సూచనల్ని పట్టించుకోకుండా సమాధానాల్లో అపరిమితమైన పదాలు రాసి ఆప్షన్లు/సెక్షన్లను మిస్ చేసి మార్కులు పోగొట్టుకుంటారు. అందువల్ల, పరీక్షల్లో ఏ ప్రశ్నకు ఎంతవరకు సమాధానం రాస్తే సరిపోతుందో చూసుకోండి. ఎలా మొదలుపెట్టాలి? ఏ అంశంతో ముగించాలనే అంశంపై ఒక్క నిమిషం ఆలోచించి ఆ దిశగా సమాధానాలు రాస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
అనవసర ఆందోళన
పరీక్షలంటే ఆందోళన, ఒత్తిడికి గురై కొందరు విద్యార్థులు సులభమైన ప్రశ్నల్ని కూడా వదిలేస్తుంటారు. ఇలాంటి పొరపాట్లు వారి స్కోరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల పరీక్షల సమయంలో మంచి ఆహారం తీసుకోవడంతో పాటు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సంబంధం లేనివి రాయడం
కొందరు విద్యార్థులు ప్రశ్నకు సంబంధం లేకుండా ఏదో ఒకటి రాస్తూ ఖాళీ పేపర్‌ని నింపేందుకు ప్రయత్నిస్తుంటారు. స్పష్టత లేకుండా పొడవైన వ్యాసాలు రాసేస్తారు. ఇలాంటి చర్యలు మూల్యాంకనం చేసేవారికి విసుగు తెప్పిస్తాయి. తద్వారా విద్యార్థికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
పునఃసమీక్ష కొరవడటం
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ. ఇంకా రాయాల్సిన ప్రశ్నలుంటే అప్పటికే రాసిన సమాధానాలను పునఃసమీక్షించుకోలేరు. దీంతో తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కోల్పోతారు. అందువల్ల పరీక్ష రాసిన తర్వాత ఒక్కో సమాధానాన్ని రివ్యూ చేసుకునేలా తగిన జాగ్రత్త వహించండి. తద్వారా మీరు రాసిన సమాధానం కచ్చితంగా ఉందా? ప్రశ్నలకు తగ్గట్టే సమాధానాలు రాశారా? లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే చెక్ చేసి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.