JEE Main 2026 | జేఈఈ మెయిన్ 2026: తొలి రోజు షిఫ్ట్ - 2 పేపర్ రివ్యూ..!
జేఈఈ మెయిన్ (JEE Main 2026)తొలి రోజు పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ ఉదయం మొదటి షిఫ్ట్ జరగ్గా.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష నిర్వహించారు.
By Education News Team
Updated : 21 Jan 2026 20:59 IST
https://results.eenadu.net/news.aspx?newsid=JEE-Main-2026-Shift-2-Paper-Analysis
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2026)తొలి రోజు పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ ఉదయం మొదటి షిఫ్ట్ జరగ్గా.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష నిర్వహించారు. అయితే, మొదటి షిఫ్ట్‌లో పేపర్‌తో పోలిస్తే రెండో షిఫ్ట్‌లో వచ్చిన పేపర్ కాస్త సులువుగా ఉన్నట్లు పలువురు విద్యార్థుల అభిప్రాయాలు, నిపుణులు విశ్లేషణల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా, ఈ రెండు షిఫ్ట్‌ల్లోనూ మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కష్టతరంగా ఉన్నప్పటికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రం మొదటి షిఫ్ట్‌తో పోలిస్తే కాస్త సులువుగానే ఉన్నట్లు సమాచారం. జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 14.10లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కంటే మ్యాథమెటిక్స్‌ని విద్యార్థులు కొంత సవాల్‌గానే భావించారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఫిజిక్స్ పేపర్ సులువు నుంచి మధ్యస్థంగా ఉండగా.. కెమిస్ట్రీ మధ్యస్థ స్థాయిలో; మ్యాథమెటిక్స్ మాత్రం మధ్యస్థం నుంచి కఠిన స్థాయిలో ఉందని విశ్లేషిస్తున్నారు. కొందరు విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం.. జేఈఈ మెయిన్ షిఫ్ట్ -2 పేపర్ మొత్తమ్మీద మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పటికీ.. సబ్జెక్టుల పరంగా కొంత వ్యత్యాసం కనిపించింది. ఫిజిక్స్ సులువుగా చేయగలిగేలా ఉన్నా.. కెమిస్ట్రీ మధ్యస్థంగా, గణితం చాలా మందికి అత్యంత కఠినంగా, ఎక్కువ సమయం తీసుకొనేలా ఉన్నట్లు సమాచారం.
- గణితంతో పోలిస్తే ఫిజిక్స్ సులువుగా, కేటాయించిన సమయంలోనే పూర్తి చేయగలిగేలా ఉంది. న్యుమరికల్ ప్రశ్నలు, ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. మోడరన్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ వంటి వాటి నుంచి రెండు, మూడు ప్రశ్నలు చొప్పున ఉన్నాయి. ఆప్టిక్స్‌కి తక్కువ వెయిటేజీ ఉన్నట్లు తెలుస్తోంది.
- కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నల్లో సమతుల్యత పాటించారు. ఈ సెక్షన్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీదే ఆధిపత్యం కనిపించిందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సాధారణం కంటే తక్కువ వెయిటేజీ ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు చేయగలిగేలా ఉన్నా.. కాన్సెప్టువల్ స్టేట్‌మెంట్ల కారణంగా కొంచెం ట్రికీగా అనిపించాయని చెబుతున్నారు.
- మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో ఎక్కువ సమయం పట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఇది అత్యంత సవాల్‌తో కూడిన విభాగంగా మారిందన్నారు. ప్రధానంగా మ్యాట్రిక్స్, వెక్టార్ ఆల్‌జీబ్రా నుంచి రెండేసి చొప్పున ప్రశ్నలు ఉన్నాయి. కాలిక్యులస్‌కు అధిక వెయిటేజీ కనిపించింది. కొన్ని ప్రశ్నలకు పూర్ణాంక రూపంలో సమాధానాలు ఇవ్వడం, సంఖ్యలను పూరించడం వంటివి ఉండటం వల్ల కాలిక్యులేషన్ సమయం పెరిగిపోయిందని తెలిపారు. కొంతమేర పరిష్కరించదగినవే అయినప్పటికీ ఫైనల్ ఆన్షర్ రావడానికి కొన్ని స్టెప్స్ అవసరమయ్యాయని పలువురు పేర్కొన్నారు.