JEE Advanced 2026| జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల

JEE Advanced 2026| జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2026 పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Updated :29 Dec 2025 19:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2026 (JEE Advanced 2026) షెడ్యూల్‌ విడుదలైంది. ఇటీవల పరీక్ష తేదీ, సిలబస్‌ని ప్రకటించిన ఐఐటీ రూర్కీ.. తాజాగా పూర్తి షెడ్యూల్‌ని ప్రకటించింది. దీని ప్రకారం.. జేఈఈ మెయిన్‌(JEE Main 2026)లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 23న ఉదయం 10గంటల నుంచి మే 2వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 4. అడ్మిట్‌ కార్డులను మే 11న ఉదయం 10 గంటల నుంచి మే 17న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 17న జరగనుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌-1;  మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ మే 25న విడుదల చేసి 26వ తేదీన సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూన్‌ 1న తుది కీ, ఫలితాలను ప్రకటిస్తారు.

మరోవైపు, అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై బీఆర్క్‌ కోర్సుల్లో చేరాలనుకుంటే.. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు జూన్‌ 1 నుంచి 2 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. జోసా ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ జూన్‌ 2న సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్‌లో అధికారులు పేర్కొన్నారు. ఏఏటీ పరీక్ష జూన్‌ 4న నిర్వహించి.. అదే నెల 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.