CAT 2025 Results | క్యాట్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. 12మందికి 100 పర్సంటైల్
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐఎం(IIM)లలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు (CAT 2025 Result)విడుదలయ్యాయి.
By Education News Team
Updated :24 Dec 2025 16:47 IST
https://results.eenadu.net/news.aspx?newsid=24122025cat-results
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐఎం(IIM)లలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు (CAT 2025 Result)విడుదలయ్యాయి. నవంబర్ 30న దేశ వ్యాప్తంగా ఐఐఎం కోయ్‌కోడ్ (IM Kozhikode) 170 నగరాల్లోని 339 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తంగా 2.95లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 2.58లక్షల మందికి పైగా (86శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవల ప్రాథమిక కీ, ఫైనల్ కీలను విడుదల చేసిన అధికారులు.. తాజాగా స్కోర్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తమ స్కోర్ కార్డును పొందొచ్చు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
ఏపీ విద్యార్థికి 99.99 పర్సంటైల్ స్కోరు..
క్యాట్ ఫలితాల్లో 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో అదరగొట్టారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు కాగా.. 10మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో దిల్లీ నుంచి ముగ్గురు, హరియాణా, గుజరాత్ నుంచి చెరో ఇద్దరు చొప్పున ఉండగా.. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, 26 మంది విద్యార్థులు 99.99శాతం పర్సంటైల్, మరో 26మంది 99.98 పర్సంటైల్ స్కోరు సాధించారన్నారు. ఏపీకి చెందిన ఒకరు 99.99 పర్సంటైల్ స్కోరుతో మెరవడం విశేషం.