CTET 2026| సీటెట్‌ దరఖాస్తు పూర్తి కాలేదా? ఈ ‘వన్‌టైం ఫెసిలిటీ’ మిస్‌ అవ్వొద్దు!

CTET 2026| సీటెట్‌ దరఖాస్తు పూర్తి కాలేదా? ఈ ‘వన్‌టైం ఫెసిలిటీ’ మిస్‌ అవ్వొద్దు!

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET 2026)కు దరఖాస్తుల గడువు డిసెంబర్‌ 18తో ముగిసిన విషయం తెలిసిందే.

Eenadu icon
By Education News Team Updated :25 Dec 2025 20:31 IST

CTET 2026 Applications| దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET 2026)కు దరఖాస్తుల గడువు డిసెంబర్‌ 18తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ప్రయత్నించి పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు సీబీఎస్‌ఈ(CBSE) బోర్డు ఉపశమనం కల్పించింది. వీరంతా తిరిగి దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్‌ సరిగా పనిచేయకపోవడంతో తాము దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా సమర్పించలేకపోయామని, అందువల్ల దరఖాస్తులకు గడువును పొడిగించాలంటూ పలువురు అభ్యర్థుల నుంచి బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీటెట్‌ అప్లికేషన్‌ విండోని మళ్లీ అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. 

తాజా నిర్ణయం ప్రకారం.. ‘వన్‌ టైం ఫెసిలిటీ’ కింద డిసెంబర్‌ 27న ఉదయం 11గంటల నుంచి డిసెంబర్‌ 30న రాత్రి 11.59గంటల వరకు ఈ అప్లికేషన్‌ విండోని అందుబాటులో ఉంచనున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించి  దాన్ని పూర్తిగా సమర్పించలేని అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతేగానీ, కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు మాత్రం అనుమతి లేదని తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా ధ్రువీకరించుకోవాలని, పొరపాట్ల సవరణకు వీరికి అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.

మరోవైపు, నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 18వరకు సీటెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగగా.. దాదాపు 25లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలను సమర్పించారు. ఇందులో తుది గడువుకు ముందు రోజు దాదాపు మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. చివరి రోజు మాత్రం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో లక్షన్నరకు పైగా రిజిస్ట్రేషన్లు అసంపూర్తిగా ఉన్నాయని, అవి పూర్తిస్థాయిలో సబ్‌మిట్‌ కాలేదని గుర్తించిన అధికారులు.. వారందరికీ మరో ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం 21వ ఎడిషన్‌ సీటెట్‌ దాదాపు ఏడాది విరామం తర్వాత నిర్వహిస్తున్నందున అభ్యర్థుల పరిస్థితిని సానుభూతితో పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

సీటెట్‌.. కొన్ని ముఖ్యాంశాలివే..

  • సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు.
  • సీటెట్‌ పరీక్ష 2026 ఫిబ్రవరి 8న (ఆదివారం) జరగనుంది.
  • ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
  • సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
  • మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
  • పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్‌ -1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు.
  • హాల్‌టికెట్లను పరీక్షకు రెండు రోజుల ముందు విడుదల చేస్తారు. పరీక్ష సిలబస్‌, ఇతర వివరాలతో కూడిన బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి.