Study Tips| సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చదవాలనుకుంటున్నారా?

Study Tips| సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చదవాలనుకుంటున్నారా?

వివిధ కారణాలతో చదువును డిస్‌కంటిన్యూ చేసి తిరిగి కొనసాగించాలనుకొనేవారికి కొన్నిటిప్స్‌..

Published :30 Sep 2024 06:10 IST

Study Tips| ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది వివిధ కారణాలతో చదువు(Education)ను డిస్‌కంటిన్యూ చేస్తుంటారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనే కొన్నేళ్ల తర్వాత తిరిగి తమ చదువును కొనసాగించాలని తపిస్తుంటారు. ఇలా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చదవుకోవాలనుకోవడం సవాళ్లతో కూడుకున్నదే. కానీ, కచ్చితమైన ప్రణాళిక, టైం మేనేజ్‌మెంట్‌తో పెద్ద కష్టమేం కాదంటున్నారు నిపుణులు. కొన్నేళ్ల విరామంత తర్వాత మళ్లీ చదువు మొదలు పెట్టేందుకు కొన్ని సూచనలు ఇవే.. 

స్టడీ స్కిల్స్‌ని పెంచే 7 అలవాట్లు ఇవే.. మీరూ ట్రై చేసి చూడండి!

  • చదువుకు వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. కాకపోతే, ఏ లక్ష్యంతో చదవాలనుకుంటున్నారో తెలుసుకోండి. విజ్ఞానం కోసం, సమాజాన్ని అర్థంచేసుకొనేందుకు, పిల్లల్ని బాగా చదివించడానికి, వ్యాపారం కోసం, సమాజంలో హోదా, సమాజ సేవ, చిన్ననాటి కలను నెరవేర్చుకోడం, ఇలా.. ఎందుకోసమో స్పష్టంగా తెలుసుకొని మీ చదువును కొనసాగిస్తే మంచి ఫలితం సాధించొచ్చు. మీ జీవనశైలికి తగ్గట్టుగా కచ్చితమైన స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకొని ముందుకెళ్లండి. 
  • చదవాలంటే.. సమయ పాలన ఎంతో ముఖ్యం. రోజులో మీకు ఉన్న సమయం ఆధారంగా ఒక షెడ్యూల్‌ను రూపొందించుకోండి. రోజులో మీ ఇతర పనులకు ఎన్ని గంటలు కేటాయించాలి? చదువుకు ఎంత సమయం ఉండాలో ముందే నిర్ణయించుకోండి. దాని ఆధారంగా ఒక టైం టేబుల్‌ను తయారుచేసుకొని మీకు కనబడేలా పెట్టుకోండి. మీ పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయడం అలవాటు చేసుకోండి. 
  • చదువుకు ఏకాగ్రత ఎంతో అవసరం. అందువల్ల మీ చుట్టూ నిశ్శబ్ధ వాతావరణం ఉండేలా చూసుకోండి.  మీరు చదివే ప్రదేశాన్ని మంచి వెలుతురుతో సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోండి. తాగునీటితో పాటు మీకు అవసరమైన  మెటీరియల్‌ అందుబాటులో ఉంచుకోండి.  చదివే సమయంలో మీ దృష్టి మళ్లకుండా ఫోన్‌ను దూరంగా ఉంచండి. 
  • గంటల తరబడి ఒకేచోట కూర్చొని చదవడం వల్ల అనుకున్నంత ప్రయోజనం ఉండదు. మధ్య మధ్యలో స్వల్ప విరామం తీసుకోవడం ద్వారా నిత్యనూతనంగా ఉంటారు. మైండ్‌ రీఫ్రెష్‌ అవుతుంది. ఈ అలవాటు మీలోని మానసిక ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. 
  • మీరు చదువుతున్న అంశంలోని ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకోండి. ఇది మీ అభ్యాసన ప్రక్రియను మరింత సమర్థంగా మారుస్తుంది. అలాగే, చదివిన అంశం గురించి ఇతరులతో చర్చించడం ద్వారా ఆ సబ్జెక్టుపై మరింత పట్టు పెరుగుతుంది. 
  • మీ అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఆన్‌లైన్‌ మాధ్యమాలను వినియోగించుకోండి. ఎడ్యుకేషనల్ యాప్‌లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు వంటి డిజిటల్‌ సాధనాలతో మీ అధ్యయన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. 
  • చదువుకునే సమయంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు  యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. ఏకాగ్రతను నిలుపుకొనేందుకు కొన్ని పజిల్స్‌, గేమ్స్‌ వంటివి ఎంచుకోండి. 
  • మీ ప్రాధాన్యతలేంటో ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూనే చదువు కోసం సమయాన్ని వెచ్చించండి. మీ దినచర్యకు  ఇబ్బందిలేకుండా  ఉత్సాహంతో ముందుకు సాగడం అలవాటు చేసుకోండి. 
  • సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. ఎప్పుడూ ప్రేరణ కోల్పోకూడదు. మనిషిని నడిపించేది అంతర్లీనంగా ఉండే స్ఫూర్తే. దాన్ని నిరంతరం రగిలిస్తూ ముందుకు సాగండి. ఈ పని ఎందుకు మొదలుపెట్టామనే కారణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది.