Study Skills I స్టడీ స్కిల్స్‌ని పెంచే 7 అలవాట్లు ఇవే.. మీరూ ట్రై చేసి చూడండి!

Study Skills I స్టడీ స్కిల్స్‌ని పెంచే 7 అలవాట్లు ఇవే.. మీరూ ట్రై చేసి చూడండి!

ఎంత చదివినా గుర్తుండట్లేదు.. పరీక్షలు బాగా రాసినా స్కోరు రావట్లేదని బాధపడుతున్నారా? మీ అధ్యయన పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే!

Published :07 Sep 2024 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత చదివినా గుర్తుండట్లేదు.. పరీక్షలు బాగా రాసినా స్కోరు రావట్లేదంటూ మథనపడేవారు ఎందరో! అలాంటివారి జాబితాలో మీరూ ఉన్నారా? అయితే మీ అధ్యయన పద్ధతుల్లో కొన్ని మార్పు చేసుకోవాల్సిందే! ఈ కింది టెక్నిక్‌లను ఒక అలవాటుగా మార్చుకుంటే మీ గ్రేడ్‌లను మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ స్టడీ స్కిల్స్‌ పెంచుకోవడంలో ఉపయోగపడే ఆ అలవాట్లేంటో చూద్దామా..

1. మైండ్‌ మ్యాపింగ్‌ : అధ్యయన నైపుణ్యాలు (Study Skills)ని మెరుగుపరచడంలో మైండ్‌ మ్యాపింగ్‌ (Mind Maping) అనేది గొప్ప సాధనం. మీ ఆలోచనలు, పుస్తకంలోని కాన్సెప్టులను అనుసంధానం చేసేలా విజువల్‌ రేఖాచిత్రాల రూపకల్పనే ఈ మైండ్ మ్యాపింగ్ (Mind Maping) పద్ధతి. ఈ టెక్నిక్‌ను ఓ అలవాటుగా మార్చుకుంటే ఆయా పాఠ్యాంశాల మధ్య సంబంధాలను తేలిగ్గా అర్థం చేసుకోవడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుండేలా ఉపయోగపడుతుంది. 

2. కలర్‌ కోడెడ్‌ నోట్స్‌: నోట్స్‌ రాసేటప్పుడు వివిధ రంగులను ఉపయోగించడం ద్వారా విజువల్‌ లెర్నర్స్‌ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది. కలర్-కోడింగ్ ముఖ్యమైన కాన్సెప్టులను హైలైట్ చేయడంతో పాటు అధ్యయనాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

క్విజ్‌ పోటీల్లో పాల్గొంటారా.. గెలిస్తే ₹10లక్షలు మీకే

3. గ్రూప్ స్టడీ సెషన్‌లూ విద్యార్థుల లెర్నింగ్‌ (Learning) ప్రక్రియలో ఎంతో కీలకం. ఒంటరిగా కాకుండా ఒక గ్రూపుగా చదివేటప్పుడు విద్యార్థులు ఒకరికొకరు సహకరించుకుంటూ, అర్థంకాని కాన్సెప్టులపై తమ ఆలోచనల్ని ఇతరులతో షేర్‌ చేసుకోవడం ద్వారా సులభంగా నేర్చుకోగలుగుతారు. ఈ అలవాటును పెంపొందించుకోవడం ద్వారా అధ్యయన ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనబడే అవకాశం ఉంది. 

4. ఎడ్యుకేషనల్‌ వీడియోలు, డాక్యుమెంటరీలను చూడటం ద్వారా వివిధ అంశాలపై మీ అవగాహనా పరిధి పెరుగుతుంది. కొత్త కాన్సెప్టులు తెలుస్తాయి. ఆయా సబ్జెక్టులపై స్పష్టమైన అవగాహనను పెంపొందించడంతో పాటు సంప్రదాయ అధ్యయన పద్ధతుల నుంచి విరామాన్నిస్తుందనడంలో అతిశయోక్తి కాదు.

5. లెర్నింగ్‌ ప్రక్రియకు ఫెయిన్మన్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌ ఒక రీఛార్జిలా ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకున్న విషయాన్ని సాధారణ పదాల్లో మరొకరికి సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే నైపుణ్యాన్ని సాధించడమే ఫెయిన్మన్‌ టెక్నిక్‌. దీన్నో అలవాటుగా మార్చుకుంటే మీ అవగాహనలో లోపాలను గుర్తించడంతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం మీరు చదవాలనుకున్న సబ్జెక్టులో మీకు తెలిసినవి ఒక పేపర్‌పై అందరికీ అర్థమయ్యేంత సరళంగా రాసుకోవాలి. ఇలా రాసేటప్పుడు వచ్చే సందేహాలను అదే పేపర్‌పై వేరే సిరాతో రాయాలి. వాటికి సమాధానాలు వెతికి ఆ సందేహాలను నివృత్తి చేసుకొనే క్రమంలో మీ జ్ఞాన సంపద పెంచుకోవచ్చు.

టెన్త్‌ అర్హత చాలు.. 39 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

6. ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్‌లు ఆడే అలవాటు మీ థింకింగ్‌ కెపాసిటీని పెంచుతాయి. కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో దోహదపడతాయి. మీలో క్రిటికల్‌ థింకింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు లెర్నింగ్‌ను ఆస్వాదించే నైపుణ్యాన్ని అలవరుస్తుంది. 

7. నోట్-టేకింగ్ ద్వారా మీకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే సంగ్రహించి మీ అవసరానికి అనుగుణంగా ఆర్గనైజ్‌ చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా ఏదైనా సబ్జెక్టును మరింత బాగా అర్థం చేసుకోవడంతో పాటు రీకాల్‌ చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది.