RBI90Quiz | ప్రైజ్‌మనీ ₹10లక్షలు.. ఆర్‌బీఐ క్విజ్ పోటీలకు దరఖాస్తు చేశారా?
డిగ్రీ విద్యార్థులకు ఆర్‌బీఐ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఆ సంస్థ 90ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ క్విజ్ పోటీలు నిర్వహించనుంది. ఈ పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ ఇవ్వనుంది.
Published :05 Sep 2024 16:03 IST
https://results.eenadu.net/news.aspx?newsid=05092024
RBI90Quiz | దిల్లీ: డిగ్రీ విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణావకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90 వసంతాల వేళ దేశ వ్యాప్తంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి భారీగా ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 17 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుంచి 21 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ క్విజ్ ఏర్పాటు చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి
ఈ 21 యూనివర్సిటీలు ఫేక్.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్!
నాలుగు దశల్లో పోటీలు.. విజేతల ప్రైజ్ మనీ ఇలా..
ఈ క్విజ్ పోటీల్లో నాలుగు దశలు ఉంటాయి. తొలుత ఆన్‌లైన్ మోడ్‌లో దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. అందులో టాప్‌లో నిలిచిన వారికి రాష్ట్రస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి విజేతలను జోనల్ స్థాయికి ఎంపిక చేసి ప్రైజ్‌మనీతో పాటు సర్టిఫికెట్ అందజేస్తారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారికి జాతీయ స్థాయిలో ఫైనల్ రౌండ్ ఉంటుంది. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురు విజేతలకు ₹10లక్షలు, ₹8లక్షలు, ₹6లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు. జోనల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షల చొప్పున ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు ఇస్తారు. ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్వహించే ఈ పరీక్షలో దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, చరిత్ర, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
అర్హులు వీరే.. రిజిస్ట్రేషన్ రుసుం లేదు..
2024 సెప్టెంబర్ 1 నాటికి 25 ఏళ్ల లోపు వయసు ఉండి ఏదైనా కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారు ఈ పోటీలకు అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తొలుత https://www.rbi90quiz.in/ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం, జిల్లా, కళాశాల పేరు నమోదు చేయాలి. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరి పేర్లు, స్టూడెంట్ ఐడీ, ఈమెయిల్, ఫోన్ నెంబరు, జెండర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.