Preparation: ప్రిపరేషన్‌లో ఈ ‘మ్యాజిక్’ తెలుసా?
ప్రిపరేషన్ సమయంలో శ్రద్ధగా చదవాలని ప్రయత్నించినా ఎదురైన కొన్ని ఆటంకాల్ని ఎలా అధిగమించాలంటే..
Published :29 July 2024 07:25 IST
https://results.eenadu.net/news.aspx?newsid=29072024
Preparation | విద్యార్థులైనా.. ఉద్యోగార్థులైనా.. పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు రావాలనే కదా కోరుకుంటారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఎంత శ్రద్ధగా చదవాలని ప్రయత్నించినా కొన్ని ఆందోళనలు, సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటిని గుర్తించి ఎలా అధిగమించాలో, ‘మ్యాజిక్’ (MAGIC) మెథడ్‌ను ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!
- విద్యార్థులు ఎవరైనా సరే సబ్జెక్టులన్నింటినీ ఒకే రకమైన ఆసక్తితో చదవలేరు.. కొన్ని ఇష్టమైనవీ, మరికొన్ని కష్టమైనవీ ఉంటాయి. కానీ అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో ఆందోళనకు గురవుతుంటారు. పరీక్షలు, మార్కుల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి (Stress) మరింత పెరుగుతుందే తప్ప.. తగ్గదు. అలాగే పరీక్షల్లో మంచి మార్కులు సాధింగలమో లేదోననే ప్రతికూల ఆలోచనలూ వారిని ఇబ్బంది పెట్టొచ్చు.
- వీటిని అధిగమించడానికి... అసలు సమస్య ఏమిటనే దాన్ని గుర్తించి పరిష్కారం గురించి ఆలోచించాలి. దానివల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేయాలి. ఏమేం చేయొచ్చో ఆలోచించాలి. కార్యాచరణకు వీలైన ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. దాన్ని విధిగా పాటించాలి. ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని గుర్తించాలి. అవసరమైన మార్పులూ, చేర్పులను ఎప్పటికప్పుడు చేసుకోవాలి.
- లక్ష్య సాధనలో దృష్టికోణానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో మనసు నిండిపోతే.. సన్నద్ధత సరిగా సాగదు. నిద్రలేమితోనూ ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ ఫలితాలను అందుకోలేరు. వీటివల్ల అప్పటివరకూ చేసిన ప్రయత్నాలు కూడా వృథా అవుతాయి. ఇలాంటి ఆలోచనలతో వాస్తవ పరిస్థితులు మరింత భయపెడతాయి.
- వాయిదా వేసే ధోరణితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుబాటులో ఉన్న సమయాన్ని స్మార్ట్‌ఫోన్లూ, ట్యాబ్‌లలో వీడియో గేమ్‌లు ఆడటం, యూట్యూబ్‌లో వినోద కార్యక్రమాలు చూడటానికి వినియోగించడానికి వాడకూడదు. ఇలా చేస్తే చదవాల్సిన పాఠ్యాంశాల్ని వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించాలి. బాగా అలసిపోవడం, వినోద కార్యక్రమాలు లేదా బద్ధకం.. వీటిలో దేనివల్ల వాయిదాలు వేస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి.
- పుస్తక పఠనం/ప్రిపరేషన్ విషయంలో వాయిదాలు వేయడం అలవాటైతే.. వ్యక్తిగత అలవాట్లలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఉదయాన్నే లేవడం, ఇతర విషయాల్లోనూ వాయిదా పద్ధతినే కొనసాగిస్తారు. ఈ దురలవాటు నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనులతో జాబితా తయారుచేసుకోవాలి. ప్రాథమ్యాల ప్రకారం వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ప్రతి పనికీ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. ఈ క్రమంలో ఎన్నో అవరోధాలూ ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి.
చదవడానికి టైం చాలట్లేదా? ఇలా ట్రైచేసి చూడండి!
ఈ మ్యాజిక్ చేద్దాం!
- ‘మ్యాజిక్’ (MAGIC) యాక్టివిటీలను అలవాటు చేసుకుంటే మనకు ఎదురయ్యే అవరోధాల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. ‘మ్యాజిక్’ అనే ఆంగ్ల పదంలో ఉన్న ఒక్కో అక్షరాన్ని చూస్తే..
- ఎం- మైండ్‌ఫుల్ (Mindful): చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ, భావోద్వేగాలను అర్థంచేసుకుంటూ పనిచేయగలగాలి.
- ఎ- యాక్టివ్ (Active): నడక, వ్యాయామాలు లాంటివి అలవాటు చేసుకోవాలి. లేదా గతంలో ఇష్టమైన క్రీడనూ కొనసాగించవచ్చు. చురుగ్గా ఉండటమే ప్రధానం.
- జి- జనరస్ (generous): ఇతరుల పట్ల ఉదారంగా వ్యవహరించడాన్ని అలవాటు చేసుకోవాలి. సహ విద్యార్థులు, స్నేహితులు, చుట్టుపక్కలవాళ్లూ... ఇలా ఎవరైనా కావొచ్చు. వాళ్లను అభిమానంగా పలకరించడం, ఫోన్ చేసి మాట్లాడటం లాంటివి చేయొచ్చు.
- ఐ- ఇంటరెస్టెడ్ (interested): ఆసక్తితో ఉండటాన్ని సూచిస్తుంది. పుస్తకాలు చదువుతూ, ఏవైనా వీడియోలు చూస్తూ కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించాలి.
- సి- కనెక్టెడ్ (Connected): కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి. కొత్తవారితో మాట్లాడటానికీ చొరవ చూపించాలి.